posted on Jan 23, 2024 10:46AM
వైఎస్ ప్యామిలీ కి ఇచ్చాపురంతో విడదీయరానిబంధం ఏర్పడింది. 2004లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంతో తేవడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర ఇచ్చాపురంలో ముగించారు. ప్రస్తుతం ఆయన తనయ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు వైఎష్ షర్మిల కూడా ఇచ్చాపురం నుంచే సుడిగాలి పర్యటనలు ప్రారంభించారు.
ఎపిలో అన్నా చెల్లెల్ల రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ పర్యవేక్షణలో వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖరారుకావడం, కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలు షర్మిలసుడిగాలి పర్యటనలు ప్రారంభం కావడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తి రేకెత్తిస్తుంది.2003లో తన తండ్రి, దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను ముగించిన ఇచ్ఛాపురం నుంచి కూతురుప్రచారానికి శ్రీకారం చుట్టడంతో శ్రీకాకుళం జిల్లా మరో రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు అయ్యింది.కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..విశాఖ వేదికగా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. మరోవైపు ఇప్పటికే అభ్యర్ధుల జాబితాను దాదాపుగా పూర్తి చేసిన సీఎం వైఎస్ జగన్ కూడా..విశాఖ నుండే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర వేదికగా ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.
వైసీపీ సర్కారుపై ఇప్పటికే పదునైన విమర్శలు చేసిన షర్మిల..ఇప్పుడు క్షేత్రస్థాయి పర్యాటనకు శ్రీకారం చుట్టారు. వైఎస్ షర్మిల చేపట్టిన జిల్లాల పర్యటన మంగళవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై..ఈ నెల 31న కడప జిల్లాలో ముగుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితురాలైన వైఎస్ షర్మిల కార్యక్షేత్రంలోకి దిగారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు 9 రోజులపాటు రాష్ట్రంలో సుడిగాలిపర్యటన చేయనున్నారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పార్టీ పరిస్థితిపై ఇచ్ఛాపురంలో నేతలతో సమీక్షించారు. ఆ తర్వాత పార్వతీపురం చేరుకుని మన్యం జిల్లాకు సంబంధించి సమీక్షించారు. అనంతరం విజయనగరం చేరుకుని జిల్లాపై సమీక్ష నిర్వహించారు.
బుధవారం విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు, గురువారం (25న) కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు, శుక్రవారం (26న) తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు. శనివారం (27న) గుంటూరు, పల్నాడు, ఆదివారం (28న) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సోమవారం(29న) తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,మంగళవారం(30న) శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, బుధవారం(31న) నంద్యాల, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించి పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తారు.
వైసీపీ అభ్యర్ధుల ఎంపికను దాదాపు పూర్తి చేసిన సీఎం వైఎస్ జగన్..త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు షర్మిల కూడా జిల్లాల పర్యాటనకు శ్రీకారం చుట్టడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్‌లో పూర్తిగా స్తబ్ధత ఏర్పడింది. అధిష్ఠానం పలువురు పీసీసీ నేతలను మార్చినప్పటికీ పార్టీ కేడర్‌లో ఏమాత్రం ఉత్సాహం నింపలేకపోయింది ఇప్పుడు వైఎస్ షర్మిల ఆ పరిస్థితిని మార్చి..ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెస్తారని అధిష్ఠానం ఆశిస్తోంది.
సెప్టెంబరు 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త విని షాక్‌తో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించడం విశేషం. అప్పట్లో ఓదార్పు యాత్ర విజయవంతంగా కొనసాగింది. యాత్రతో సానుకూల ఫలితాలు సాధించి, నాలుగేళ్లలోనే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నేతగా ఎదిగారు. ఆ తర్వాతే 2019లో జగన్ సీఎం అయ్యారు. అంతకు ముందు మెగస్టార్ చిరంజీవి తన సొంత రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పార్టీని స్థాపించి యాత్ర చేపట్టింది కూడా శ్రీకాకుళం నుంచే.