మోడీ బయోపిక్ విశ్వనేత.. క్రాంతికుమార్ డైరెక్షన్ లో సినిమా | modi biopick viswaneta| director| krantikumar| music| kalabhairava| namo| political
posted on Jan 23, 2024 12:16PM
ఒక వైపు అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు ఈ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం కుదరడం కాకతాళీయం, యాథృచ్ఛికం అనే అనుకున్నా.. రామభక్తి ఒక మాయగా దేశాన్ని కమ్మేసింది. రాజకీయ, కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా దేశం అంతటా రామనామం మార్మోగింది. అది కచ్చితంగా బీజేపీకి రానున్న ఎన్నికలలో పాజిటివ్ వైబ్స్ రావడానికి కారణమౌతుందని, పొలిటికల్ మైలేజి లభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఆ మైలేజ్ సరిపోదనుకున్నారో ఏమో ఇప్పుడు మోడీ తన బయోపిక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. విశ్వనేత పేరుతో త్వరలో తెరకెక్కనున్న మోడీ బయోపిక్ ఉద్దేశం, లక్ష్యం కూడా మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ కొట్టేందుకు దోహదపడటం మాత్రమేనని చెబుతున్నారు. మొత్తం భారతీయ భాషలన్నిటిలోనూ తెరకెక్కనున్న మోడీ బయోపిక్ విశ్వనేత సినిమాకు సీహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
కాశిరెడ్డి భరత్ రెడ్డి నిర్మాత. ఈ సినిమాకు సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు కాలభైరవ. నిర్మాణ సంస్థ వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ సినిమాలో అభయ్ డియోల్, నినాగుప్తా, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య తారాగణం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలో సెట్స్ మీదకు రానున్న విశ్వనేత సినిమాలో.. ఆర్టికల్ 370 రద్దు, డీమానిటైజేషన్, జీఎస్టీ, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి సంఘటనలను హైలైట్ చేయనున్నాయి. చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వనేతగా ఎదిగిన నరేంద్రమోడీ ప్రస్థానం ఈ బయోపిక్ దృశ్యీకరించనుంది.