Leading News Portal in Telugu

మంత్రి రోజా కలెక్షన్ క్వీన్!.. సొంత పార్టీ నుంచే ఆరోపణలు.. నగరి టికెట్ హుళ్లక్కేరా? | minister roja collection queen| allegations| own| party| nagari| ticket| reject


posted on Jan 24, 2024 9:45AM

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. ఆధారాలు లేని ఆరోపణలతో అందరిపై విరుచుకుపడే మంత్రి రోజా  ఇప్పుడు  సొంత పార్టీ నేతలే కలెక్షన్ క్వీన్ అంటూ చేస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత కాలం ఇష్టారీతిగా నోరేసుకుని విపక్షాలపై అడ్డగోలు విమర్శలు చేసిన రోజా రాజకీయ జీవితానికి ఇప్పుడుఎండ్ కార్డ్ పడే పరిస్థితి తీసుకువచ్చాయంటున్నారు.   అయితే రోజా  విపక్ష నేతలపై చేసిన  విధంగా సొంత  పార్టీ ప్రజా ప్రతినిథులు ఆమెపై నిరాధార ఆరోపణలు చేయడంలేదు. సాక్ష్యాధారాలతో మీడియా సమావేశాలు పెట్టి మరీ రోజా అవినీతిని కళ్లకు కడుతున్నారు.  

తమ వ్యతిరేకులపై  ఆధారాలు లేని ఆరోపణలతో గొబెల్స్ ప్రచారం చేసి ప్రజలను మభ్య పెట్టడమనే టెక్నిన్ ను గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ఇష్టారీతిగా వాడేసింది. ఇప్పుడు సొంత పార్టీ నేత, మంత్రి రోజాపై  కూడా అదే టెక్నిక్ వాడుతోంది. అయితే  రోజా ఫైర్ బ్రాండ్ కదా, అందుకు ఆమె నోరెత్తే అవకాశం లేకుండా  కొన్ని ఆధారాలను కూడా చూపిస్తోంది.  తాజాగా మంత్రి రోజాపై ఆమె సొంత పార్టీకీ, సొంత నియోజకవర్గానికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులు అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీని వెనుక పార్టీ అగ్రనాకత్వం హస్తం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇంత కాలం రోజా జనసేన అధినేత పవన్ ను ప్రాకేజీ స్టార్ అంటూ ఒక్క ఆధారం చూపకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు శతధా ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలం కావడం వల్లే తనకు మంత్రి పదవి వచ్చిందని భావించి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత రోజా మరింత రెచ్చిపోయారు. విరామం లేకుండా నోటికి పని చెప్పారు.  అయితే ఎంతగా విపక్ష నేతలపై విరుచుకుపడినా.. జగన్ మాత్రం ఆమెను దూరం పెట్టడానికే నిర్ణయించుకున్నారు.  అందుకే ఆమె వ్యతిరేకులకు స్వేచ్ఛ ఇచ్చేశారు. సరిగ్గా ఎన్నికల ముందు.. టికెట్ నిరాకరించినా ఆమె రచ్చకెక్కేఅవకాశం లేకుండా  సొంత పార్టీ నేతల చేత రోజా అవినీతికి పాల్పడ్డారు. కలెక్షన్ క్వీన్ గా మారిపోయారు అంటూ ఆరోపణలు చేయిస్తున్నారు.

 ఒక మంత్రిపై మీడియా అధకార పార్టికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథి మీడియా సమావేశం పెట్టి మరీ అవినీతి ఆరోపణలు చేశారంటే అందుకు పార్టీ అధినాయకుడి అనుమతి ఉందనే భావించాల్సి ఉంటుంది. మంత్రి రోజా, ఆమె సోదరుడు కుమారస్వామి రెడ్డి పై సొంత పార్టీ కౌన్సిలర్ తీవ్ర ఆరోపణలు చేసారు. పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ కుమారస్వామి తమ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసారంటూ వైసీపీకి చెందిన  పుత్తూరు 17 వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి ఆరోపించారు.   చైర్మన్ పదవి కోసం రోజా అన్నయ్యకు  దళిత మహిళనైన తాను  మూడు విడుతలలో 40 లక్షలు చెల్లించానని, అయితే  చైర్మన్ పదవి ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు.   రోజా చెప్పిన మీదటే తాను ఆమె అన్నను కలిసి సొమ్ములు ఇచ్చా మన్నారు. ఇప్పుడు తమకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.   

ఈ ఆరోపణలపై నిజమేంటో నిగ్గు తేల్చాల్సింది సీఎం జగనే. అయినా మంత్రిగా రోజా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె వసూల్ రాణిగా మారిపోయారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయన్న విషయాన్ని తెలుగువన్ 2022లోనే చెప్పింది.   రోజా  మంత్రి పదవి చేపట్టి న వంద రోజులకే ఆమె కాష్ కౌంటర్ ఓపెన్ చేశారు. కోట్లు సంపాదిస్తున్నారు అంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.  అప్పట్లో ఆ ఆరోపణలను ఇసుమంతైనా పట్టించుకోని జగన్ ఇప్పుడు మాత్రం రోజాపై వస్తున్న ఆరోపణలను సీరియస్ గా తీసుకున్నారని అంటున్నారు. అయితే అందుకు కారణం రోజాపై అవినీతి ఆరోపణలు కావనీ, ఈ సారి నగరి టికెట్ రోజాకు ఇవ్వకుండా ఉండేందుకే పార్టీ అగ్రనాయకత్వమే ఈ ఆరోపణలను ప్రోత్సహిస్తున్నదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అలా కాకపోతే దళితుడిని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును చంకనెక్కించుకున్న జగన్.. ఒక కౌన్సిలర్  రోజాపై చేసిన ఆరోపణలను నిజంగా సీరియస్ గా తీసుకున్నారనీ,  తీసుకుంటారనీ ఎలా నమ్మగలమని అంటున్నారు. అయితే నగరి నియోజకవర్గం నుంచి రోజాకు టికెట్ నిరాకరించడానికి ఇప్పటికే డిసైడ్ అయిపోయినందుకే ఆమెపై మీడియా సమావేశాలలో అవినీతి ఆరోపణలు గుప్పించేలా ఆమె వ్యతిరేకులను ప్రోత్సహిస్తున్నారనీ అంటున్నారు.   రోజాకు ఈ సారి అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేదన్న నిర్ణయానికి ఇప్పటికే వచ్చేసిన జగన్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారనీ, టికెట్ ఇవ్వకపోయినా రోజా నోరెత్తడానికి అవకాశం లేకుండా ఇలా సొంత నియోజకవర్గం నుంచే ఆమెపై విమర్శలు, ఆరోపణలు వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనీ వైసీపీ శ్రేణులే అంటున్నాయి. పుత్తూరు కౌన్సిలర్ ఆరోపణలు మాత్రమే కాదు, చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు కూడా రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఆమెకు ఈ సారి నగరి నుంచి పార్టీ టికెట్ ఇస్తే తామంతా ఆమెకు వ్యతిరేకంగా పని చేసి ఓడిస్తామని అల్టిమేటమ్ ఇచ్చారు. 

అయితే ఈ పరిస్థితులు ఎదురైనా రోజాకు మాత్రం ఏ వర్గం నుంచీ మద్దతు కానీ సానుభూతి కానీ లభించడం లేదు. పైగా తగిన శాస్తి జరిగిందన్న భావనే పార్టీలో వ్యక్తం అవుతోంది. ఇక విపక్షాల నుంచైతే రోజాపై విమర్శల దాడి పెరిగింది. ఆమెకు వైసీపీ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ, ముందు తనపై సొంత పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిథులు చేసిన ఆరోపణలను ఆమె సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 

వాస్తవానికి నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. పార్టీ పదవుల కోసం ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఐప్యాక్ సహా ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నిటిలోనూ నగరిలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందనే వెల్లడించాయి. అన్నిటికీ మించి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు సత్సంబంధాలు లేవు. వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న జగన్ ఆమెకు టికెట్ ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అయితే టికెట్ నిరాకరించినందుకు రోజా బాహాటంగా తన అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం లేకుండా ఇప్పుడు ఆమెపై ఉన్న ఆరోపణల చిట్టాను బయటపెట్టి కట్టడి చేస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.