జగన్ లో భయానికి నిదర్శనం.. గంటా రాజీనామా ఆమోదం! | speaker tammineni accept ganta resignation| rajyasabha| elections| jagan| defeat| fear| cross| voting| doubts
posted on Jan 24, 2024 10:42AM
తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. అసలు గంటా శ్రీనివాసరావు రాజీనామా ఏమిటి? ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించడమేంటి? అన్న సందేహాలు ఒక్కసారిగా సర్వత్రా వ్యక్తమయ్యాయి. ఇంతకీ విషయమేమిటంటే.. ఎప్పుడో మూడేళ్ళ కిందట గంటా శ్రీనివాసరావు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరిలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. జగన్ సర్కార్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదని అప్పట్లో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన రాజీనామాను కూడా స్పీకర్ ఫార్మాట్‌లోనే సమర్పించారు. అంతే కాదు అప్పట్లో స్వయంగా స్పీకర్‌ని కలిసి తన రాజీనామాని ఆమోదించాల్సిందిగా కోరారు. కానీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించలేదు. రాజీనామాను ఆమోదించలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల తరువాత ఎందుకో ఆయనకు చురుకుపుట్టింది. వెంటనే రాజీనామాను ఆమోదించేశారు. ఏమైంది స్పీకర్ కు మూడేళ్ల తరువత మెలకువ వచ్చిందా? అంటూ పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికల ముంగిట గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదముద్ర వేయడం వల్ల ప్రయోజనమేమిటని ప్రశ్నిస్తున్నారు.
కొన్ని రోజుల కిందట తమ్మినేని సీతారాం తనకు కానీ తన కుటుంబానికి కానీ ముఖ్యమంత్రి జగన్ ఆముదాల వలస నుంచి పోటీకి అవకాశం లేదని తెగేసి చెప్పేశారు. దీనిపై సీతారాం తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు కూడా. విలువలకు తిలోదకాలిచ్చేసి, అత్యంత గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉండి కూడా కేవలం జగన్ ప్రాపకం కోసం
విలువలకు వలువలు ఒదిలేసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని విమర్శల పేర తిట్టడమే పనిగా పెట్టుకుని రాజ్యాంగబద్దమైన పదవి ఔన్నత్యాన్ని కూడా కించపరిచి స్పీకర్ హోదాలో ఇష్టారీతిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తమ్మినేని సీతారాంకు ఆముదాల వలస నియోజకవరం టికెట్ ను బొడ్డేపల్లి పద్మజ కు ఇచ్చేశారు. ఆ పరాభవాన్ని తట్టుకోలేక సీతారాం అస్వస్థతకు గురయ్యారు కూడా. కానీ రోజుల వ్యవధిలోనే ఏమైందో ఏమో.. సిట్టింగుల మార్పు విషయంలో జగన్ పునరాలోచనలో పడ్డారంటూ వస్తున్న వార్తలతో మళ్లీ తమ్మినేనిలో ఆశలు చిగురంచాయో ఏమో.. గంటా శ్రీనివాసరావు ఎప్పుడో 2021లో చేసిన రాజీనామాను ఆఘమేఘాల మీద ఆమోదించేయడం ద్వారా జగన్ కు మేలు చేసేశానని అనుకుంటున్నారు.
ఒక్క గంటా రాజీనామాను ఆమోదించడమే కాదు.. వైసీపీ నుంచి బహిష్కృతులై తెలుగుదేశం కు చేరువైన నలుగురు ఎమ్మెల్యేలు, పార్టీని వీడిన మరో నలుగురు ఎమ్మెల్యేలకూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. మీ మీద అనర్హత వేటు ఎందుకు వేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం తరువాత ఎలాగా వారిపై అనర్హత వేటు వేసేస్తారు. ఇంత కాలం లేనిది ఇప్పుడింత ఇంత హఠాత్తుగా తమ్మినేని మేల్కొని హడావుడి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం రాజ్యసభ ఎన్నికలేనని పరిశీలకులు చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. వైసీపి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీలో చేరిన టిడిపి ఎంపీ సిఎం రమేష్ ల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తుంది.
ఒక్కో ఎంపీ అభ్యర్ధి గెలవాలంటే 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆ లెక్కన మూడు సీట్లు వైసీపి దక్కించుకోవాలంటే మొత్తం 132 మంది ఎమ్మెల్యేలు అవసరం. వైసీపికి 151 మంది ఎమ్మెల్యేలున్నప్పటికీ వారిలో 8మంది బయటకు వెళ్ళిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిల మార్పులు చేర్పుల కారణంగా మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు.మరి కొంత మంది ఆ బాటలోనే ఉన్నారు. అయినా ఉన్న బలంతో వైసీపి ముగ్గురు ఎంపీ అభ్యర్ధులను గెలిపించుకోగలదు. కానీ వైసీపిని వీడినవారు, వీడబోతున్నవారు, తీవ్ర అసంతృప్తితో క్రాస్ ఓటింగ్ కు పాల్పడే వారి వల్ల మూడు రాజ్యసభ సీట్లనూ దక్కించుకోవడం కష్టమేమో అన్న భయం జగన్ ను వెంటాడుతోంది. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురైన పరాభవ భారం, భయం జగన్ ను వెంటాడుతూనే ఉందనడానికి గంటా రాజీనామా ఆమోదం, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు నిదర్శనమని అంటున్నారు.
అయితే తన రాజీనామా ఆమోదంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు.. ఎప్పుడో 2021లో తాను చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు తన రాజీనామాను ఆమోదించడం రాజ్యసభ ఎన్నికలో తాను ఓటు వేయకుండా నిరోధించడానికేనని ఆరోపించారు. అయితే తాను న్యాయపరంగా అన్ని అంశాలనూ పరిశీలించి, ఓటు వేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీకే ఓటేస్తానని కుండబద్దలు కొట్టేశారు.