Leading News Portal in Telugu

జగన్ ఇలాకాలో 17 ఆస్పత్రుల లైసెన్సులు రద్దు.. ఎందుకో తెలుసా? | arogyasri services stop ap| kadapa| 17| hospitals| license


posted on Jan 29, 2024 1:51PM

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. పేదల ఇబ్బందులు జగన్ సర్కార్ కు పట్టడం లేదు.  ఇంతకీ ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు ఎందుకు నిలిచిపోయాయి అంటే సమాధానం కోసం ఎవరూ పెద్దగా తడుముకోనవసరం లేదు. ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల  విడుదలలో మొండి చేయి చూపడమే కారణమన్నది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. వందల కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తున్నదేమిటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం. ఇప్పటికే అమలు చేస్తున్న బటన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే. 

ఆర్భాటంగా పథకాలు ప్రకటించేయడమే తప్ప అవి అమలు అవుతున్నాయా? లబ్ధిదారులకు ప్రయోజనం అందుతోందా అన్న విషయాన్ని పట్టించుకోవడం జగన్ సర్కార్ డిక్షనరీలోనే లేదని ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అందరికీ అర్ధమైపోయింది. ఇప్పుడు తాజాగా ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు కూడా ఆ కోవలోకే వస్తుందని తేలిపోయింది. 

జగన్ విధానాల డొల్ల తనానికి  బకాయిలు పేరుకు పోయి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడాన్ని తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.   తాజాగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో  కూడా ప్రభుత్వానికి ఆస్పత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేశాయి. ఔను కడప జిల్లాలో ఏకంగా 17 ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమని చేతులెత్తేశాయి. జిల్లాలో ఆరోగ్య శ్రీ సేవలు అందించే  18 ఆస్పత్రులలో 17 ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ తమ ఆస్పత్రుల వద్ద ఆ మేరకు బోర్డులు కూడా ఏర్పాటు చేశాయి. ఎన్నికల ముంగిట ఈ పరిణామం జగన్ కు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. 

ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పాతిక లక్షలకు పెంచుతూ ఇటీవలే జగన్ సర్కార్ ఉత్తర్వ్యులు జారీ చేసింది. జగన్ ఆర్భాటంగా ఈ పథకానికి నిధుల పెంపు కార్యక్రమాన్ని ప్రకటించడమే కాకుండా, అందుకు సంబంధించి నూతన ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ కూడా షురూ చేశారు. ఇంతకీ ఈ హడావుడి పెంపు, కొత్త కార్డుల పంపిణీ ఎందుకయ్యా అంటే.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే కొత్త ఆరోగ్య శ్రీ కార్డులపై జగన్  ఫొటో ఉంటుంది కనుక.  

ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి తనను  పేదల పాలిట పెన్నిధిగా, అప్బాధబాంధవుడి అభివర్ణించుకునేందుకు మాత్రమే ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పాతిక లక్షలకు పెంచింది. అమలు కాని పథకాన్ని ఎంత పెంచితే మాత్రం నష్టం ఏమిటన్న రీతిలో జగన్ సర్కార్ ఈ పెంపు కార్యక్రమాన్ని ప్రకటించేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రకటనోనే ఊరుకోకుండా ఇందు కోసం భారీ ఎత్తున ఒక సభ,  కార్డుల తయారీకి, కార్డుల పంపిణీ  ఇలా ఇందుకోసం జగన్ సర్కార్ భారీగానే ఖర్చు చేసింది.  అయితే జగన్ ఈ పథకాన్ని ప్రకటించే సమయానికి  రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎన్ని ఆసుపత్రులలో అందుబాటులో ఉంది? ఏ జిల్లాలో ఏ ఆసుపత్రులకు ఈ వైద్య సేవ అమలు చేస్తున్నారు? ఆరోగ్యశ్రీ కింద ఎన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు? వైద్య పరీక్షలు, వైద్యం, అనంతరం తగిన మందులు కూడా ఆరోగ్యశ్రీలో భాగంగానే అందిస్తారా? మారిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి విధి విధానాలు, ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న ఆసుపత్రులకు అందించారా?  అన్న విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. అలాగే అసలు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ బిల్లుల బకాయిల బకాయిలు ఎంత, అసలీ రమారమి ఐదేళ్ల పాలనలో ఆరోగ్య శ్రీ   పథకానికి ఎకేటాయించిన నిథులెన్నితదితర అంశాలపై ప్రజల సంగతి అలా ఉంచి కనీసం ప్రభుత్వానికైనా క్లారిటీ ఉందా అంటే జవాబు కోసం వెతుక్కోనవసరం లేదు. కానీ ఆ ప్రశ్నలకు బదులిచ్చేందుకు ప్రభుత్వం వద్దనైనా సమాచారం ఉందా అంటే పరిశీలకులు లేదనే విశ్లేషిస్తున్నారు.

ఎందుకంటే.. నాలుగున్నరేళ్ల జగన్ ప్రభుత్వ హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి కోటాను కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు.  గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో  కొంచం ఆలస్యంగానైనా, అంటే  ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు.   వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై  ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే రావాల్సిన బకాయిల సంగతెలా ఉన్నా.. ఇకపై తమకు ఆరోగ్యశ్రీనే వద్దంటూ కొన్ని ఆసుపత్రులను ఈ సేవ నుండి బయటకొచ్చేశాయి. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవ తమ ఆసుపత్రికి కావాలంటూ దరఖాస్తుల వెల్లువ రాగా.. ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీలో ఉన్న ఆసుపత్రులే బయటకి వచ్చేశాయి.

ఇక మరికొన్ని ఆసుపత్రులలో అయితే కేవలం వైద్యం మాత్రమే ఆరోగ్య శ్రీలో అందిస్తుండగా.. మిగతా వైద్య పరీక్షలు, మందులు వంటివి రోగుల వద్ద డబ్బులు కట్టించుకుంటున్నారు. కొన్ని ఆసుపత్రులలో అయితే ఆసుపత్రులలో అన్ని పరీక్షలు చేసే సదుపాయం ఉన్నా.. బకాయిలు రాక ఆరోగ్యశ్రీ పేషేంట్లను బయట ల్యాబులకు పంపి పరీక్షలు చేయిస్తున్నారు. కేవలం డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రి రూమ్ అద్దెలు వంటివి మాత్రమే ఆరోగ్యశ్రీలో అందిస్తున్నారు. వాటికి ఆసుపత్రుల యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే అవసరం లేకపోవడంతో.. ప్రభుత్వం నుండి బకాయిలు ఎప్పుడొచ్చినా తమకి నష్టం ఉండదన్న ఆలోచనతో ఇలా ఆరోగ్యశ్రీలో కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం ఆసుపత్రులైతే ప్రభుత్వం మారకపోతుందా.. కొత్త ప్రభుత్వంలో అయినా బిల్లులు రాకపోతాయా అని కొనసాగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితిలో ఆరోగ్య శ్రీని రూ.25 లక్షలకు పెంచినా ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాకు పదుల సంఖ్యలో ఉన్న ఆరోగ్యశ్రీ.. ఇప్పుడు జిల్లాకు పది కూడా లేకపోగా.. ఉన్న వాటిలో కూడా వైద్యం అంతంత మాత్రమే. మరి ఈ పరిస్థితుల్లో ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి ఏకంగా పాతిక లక్షలకు పెంచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ఉంది. ఆ ప్రయోజనం పేద రోగులకు కాదు.. మరో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్ కు. ఔను జగన్ కు ఈ నిర్ణయం రాజకీయంగా లబ్ధి చేకూరుతుందని ఆయన అనుయాయులు, వంధిమాగధులు గట్టిగా నమ్ముతున్నారు.  ఈ నేపథ్యంలోనే బకాయిలు పేరుకుపోవడం వల్ల ఆరోగ్య శ్రీ సేవలు అందించలేమంటూ బోర్డులు తగిలించిన కడప జిల్లాలోని 17 ఆస్పత్రుల లైసె్సులు రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  మొత్తంగా ఉత్తుత్తి పథకాలతో జగన్ పేదలను మభ్య పెట్టి ఎన్నికల పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.