మోగిన ఎన్నికల నగారా.. రాజ్యసభ ఎలక్షన్ షెడ్యూల్ విడుదల | ec release rajyasabha election schedule| febraury8| notification| 28yh
posted on Jan 29, 2024 2:12PM
రాజ్య సభ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం (జనవరి 29) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 8న రాజ్య సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది.
అదే నెల 27 పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాలలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ రాజ్య సభ ఎంపీలు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల పదవి కాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుండగా.. ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.
రాజ్య సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి అదే నెల 15 వరకూ నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి 15 కాగా, ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన, ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకూ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 27న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను ప్రకటిస్తారు.