Leading News Portal in Telugu

గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ యేనా? సీఎంగా కేసీఆర్ వ్యూహాలు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయా? | greater brs mlas eye congress| follow| kcr| operation


posted on Jan 29, 2024 3:34PM

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా తయారైంది కేసీఆర్ పరిస్థితి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలను గంపగుత్తగా తన పార్టీలో చేర్చుకుని విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ఆయన అప్పుడు అమలు చేసిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం, ఇప్పుడు రివర్స్ లో ఆయనకు ఆపరేషన్ వికర్ష్ గా మారి ఏకంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని ఎదుర్కొన్న బీఆర్ఎస్ కు, ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే పెద్ద టాస్క్ గా మారిపోయింది. మర్యాదపూర్వకం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీకి క్యూకడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఇదే బీఆర్ఎస్ ను కంగారు పెడుతోంది.

అందుకే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రేవంత్ సర్కార్ త్వరలోనే పతనమౌతుందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి దుందుడుకు విమర్శలతోనే ఆయన పువ్వల్లో పెట్టి అధికారాన్ని కాంగ్రెస్ కు అప్పగించారంటూ ఇప్పటికే ఆయనపై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పడు రేవంత్ ప్రభుత్వ పతనం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కింది స్థాయి క్యాడర్ కు కూడా రుచించడం లేదని అంటున్నారు. అది పక్కన పెట్టి ప్రస్తుతానికి వస్తే.. ముందుగా బీఆర్ఎస్ కు కొద్దో కొప్పో పరువు నిలిచింది అనుకునేలా అసెంబ్లీ ఎన్నికలలో స్థానాలు రావడానికి కారణమైన గ్రేటర్ పరిధిలోనే ఆ పరువు పోయేలా ఎమ్మెల్యేల జంపింగులు ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లా బరితెగింపుగా బెదరింపులకు పాల్పడక పోయినప్పటికీ గ్రేటర్ పరిధిలోని భూ కుంభకోణాలపై సీఎం రేవంత్ సీరియస్ గా దృష్టి సారించారు. దీంతో సహజంగానే బీఆర్ఎస్ గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలలో ఒకింత ఆందోళన మొదలైంది. గతంలో తెలుగుదేశం తరఫున గెలిచిన మాధవరం వంటి వారు బీఆర్ఎస్ గూటికి చేరుతూ మీడియా సమావేశంలో చెప్పిన విషయాలను ఒక్క సారి గుర్తు చేసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అటువంటి ఆందోళనలోనే ఉన్నారని అనిపించక మానదు.  నాడు హైదరాబాద్ లో ఉన్న తమ ఆస్తుల రక్షణ కోసం పార్టీ మారక తప్పడం లేదని బీఆర్ఎస్ గూటికి చేరే సమయంలో మాధవరం వంటి వారు మీడియా ముఖంగానే చెప్పారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి మారేందుకు అవే మాటలను చెప్పినా ఆశ్చర్యం లేదు. నాడు బెదరించి, ప్రలోభ పెట్టి ప్రత్యర్థి పార్టీలను బీఆర్ఎస్ ఎలా అయితేఎలాగైతే నిర్వీర్యం చేసిందో ఇప్పుడు అదే విధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

అసలు కాంగ్రెస్ కు ఆ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేకుండానే బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూకట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. అందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాలే కారణమని చెబుతున్నారు. కాంగ్రెస్ దృష్టి తమ మీద పడేకంటే ముందే ఆ గూటికి చేరితే ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీ అధినేతకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా సీఎంతో భేటీకి క్యూకడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎన్న   ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే  ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే  తెల్లం వెంకట్రావు రేవంత్ తో భేటీ అయ్యారు.  అప్పట్లోనే మరో అరడజను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటించారు. 

అంటే ఓడలు బళ్లు..బళ్లు ఓడలు అయినట్లు గతంలో తాము అధకారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్   ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఉపయోగించిన వ్యూహాలు ఎత్తుగడలు ఇప్పుడు రివర్స్ లో కాంగ్రెస్ ప్రయోగిస్తుందన్న లాజిక్ ను చూపుతూ ఇప్పటి అధికార పార్టీ నుంచి అసలా ప్రక్రియ మొదలు కాకముందే  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగేందుకు తహతహలాడుతున్నారు. ఇక అధికార కాంగ్రెస్ విషయానికి వస్తే.. తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన గ్రేటర్ పైనే దృష్టి పెడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసలా దిశగా ఇప్పటికే సైలెంట్ ఆపరేషన్ మొదలు పెట్టేసిందని కూడా అంటున్నారు. 

గ్రేటర్ పరిధిలో  బలం ఉందని భావించిన బీఆర్ఎస్ లీడర్లపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసిందని చెబుతున్నారు. అందులో భాగమే రేవంత్ రెడ్డి తో  మర్యాదపూర్వక భేటీలకు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యులు క్యూకడుతున్నారని చెబుతున్నారు.  మాజీ మంత్రి మల్లారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇలా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.  బీఆర్ఎస్ పార్టీ  2014 ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో సరైన అభ్యర్థులు కూడా దొరకని స్థితి నుంచి 2018 ఎన్నికల నాటికి ఎలా బలపడిందో.. సరిగ్గా అదే విధంగా 2018లో గ్రేటర్ లో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ బలోపేతం కావడానికి పెద్ద సమయం పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.