posted on Jan 31, 2024 11:30AM
‘ప్రత్యేక హోదా సాధన సమితి’ ఆధ్వర్యంలో బుధవారం విశాఖపట్నం టూటౌన్ ఏరియాలోని గాంధీ విగ్రహం వద్ద జైభారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ఓ గొప్ప అవకాశం వచ్చిందని జేడీ లక్ష్మీనారాయణ బుధవారం పేర్కొన్నారు.పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల రూపంలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని రాజకీయ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. విభజన హామీలను నెరవేర్చాలని, ఏపీకి వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలనే డిమాండ్ తో పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని ఎంపీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ‘వోట్ ఆన్ బడ్జెట్’ను అడ్డుకోవడం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు ముగిసిన అధ్యాయాలు కావని, స్వార్థం కోసం ముగింపబడిన అధ్యాయాలు మాత్రమేనని ఆయన అన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రతిపాదించగా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలని కోరిందని గుర్తుచేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.