posted on Jan 31, 2024 4:08PM
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్సు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన జీవో 47ను రద్దు చేయాలని నాగోల్‌కు చెందిన హరీందర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఉచిత ప్రయాణం వల్ల బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు.అయితే ఈ పిటిషన్‌లో ఎలాంటి ప్రజాప్రయోజనం లేదని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్ తాను ఇబ్బంది ఎదుర్కొని పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. ఈ క్రమంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రిట్ పిటిషన్‌గా మార్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని అమలు చేసింది. ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలే లబ్దిదారులు. దీంతో పురుషులకు సీట్లు దొరకడం లేదు. నిల్చునే ప్రయాణాలు చేయాల్సి వస్తుందని ప్రజా ప్రయోజన వాజ్యంలో పేర్కొన్నారు.