Leading News Portal in Telugu

షర్మిల భద్రత కుదింపు.. జగన్ సర్కార్ తీరుపై సర్వత్రా అనుమానాలు! | sharmila security Aridgment| harm| ycp| criticiz


posted on Feb 1, 2024 8:59AM

కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ప్రాణాలకు హాని ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తన సొంత అన్న జగన్ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో  విమర్శలు గుప్పిస్తున్న షర్మిలకు ప్రాణహాని ఉందన్న అనుమానాలను ఇప్పటికే తెలుగుదేశం నాయకులు వ్యక్తం చేశారు. తనను విమర్శించే వారిపై జగన్ వ్యవహరించే తీరును ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అందుక దళిత వైద్యుడిపై పిచ్చివాడన్న ముద్ర వేసిన సంఘటన నుంచీ, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలపై కేసులు, వేధింపులు, దాడుల వరకూ పలు ఉదాహరణలను చూపుతున్నారు. 

అంతెందుకు గత ఎన్నికలలో తన విజయం కోసం కాళ్లరిగేలా తిరిగి, ప్రచారం చేసిన సొంత సోదరి షర్మిలను తాను అధికారంలోకి  రాగానే రాష్ట్రం నుంచి తరిమేయడమే కాకుండా, పొరుగు రాష్ట్రంలో  సొంత పార్టీ పెట్టుకున్నా, ఆమెకు ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల ఏపీ పాలిటిక్స్ లో అడుగుపెట్టి, కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి అన్నపైనే విమర్శల బాణాలు కురిపిస్తున్న తరుణంలో ఆమె ప్రాణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలకు బలం చేకూర్చే విధంగానే జగన్ సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కుదించేసింది. ఇప్పటి వరకూ ఫోర్ ప్లస్ ఫోర్ గా ఉన్న ఆమె భద్రతను వన్ ప్లస్ వన్ కు కుదించేయడం..ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అయితే తక్షణం ఆమెకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది.  

ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే భద్రతను కుదించారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, జగన్ సర్కార్ విధానాలను, వ్యవహార శైలిని తప్పుపడుతున్న వారిపై జరిగిన దాడులను ఉదాహరణలుగా చూపుతూ, ఇప్పుడు షర్మిల జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తూ, సవాళ్లు విసురుతూ రాష్ట్రాన్ని చుట్టేస్తున్న షర్మిలపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 షర్మిల కూడా నేరుగా అన్న జగన్ అవకతవకలను, అరాచక పాలనను విమర్శిస్తూ, విపక్షాల కంటే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు బెదరింపులు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆమె వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా పోస్టులు పెడుతోంది. అలాగే మంత్రులు, వైసీసీ నేతలూ  కూడా  షర్మిలపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.  అసలు ఆమె రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఏపీలోకి వచ్చిన రోజే పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని నానా హంగామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ.. జగన్ హయాంలో ఏపీలో  పోలీసు వ్యవస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారిపోయిందనీ, విపక్ష నేతలపై దాడులకు పాల్పడిన వైసీపీ వారిపై కాకుండా దాడికి గురైన బాధితులపైనే కేసులు నమోదు చేస్తు భయభ్రాంతలకు గురి చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శిస్తున్నారు.   మొత్తం మీద షర్మిల జగన్ సర్కార్ పై విమర్శల దాడి జోరు పెంచుతున్న సమయంలోనే ఆమెకు భద్రత కుదించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు కుదించిన భద్రతను వెంటనే పునరుద్ధరించాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ ఆందోళనలక సిద్ధమౌతోంది.