Leading News Portal in Telugu

వల్లభనేని వంశి.. హిట్ వికెట్టా.. క్లీన్ బౌల్డా? | vallabaneni vamshi clean bowled| hit| wicket| ycp| gannavaram| ticket| consider| away


posted on Feb 1, 2024 10:04AM

వల్లభనేని వంశి ఏపీ రాజకీయాలతో పరిచయం ఉన్నవారికి ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుసగా రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత విపక్షంలో ఉండలేక అధికార పార్టీ పంచన చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వంశీ ఆ తరువాత గురువుకే పంగనామాలు పెట్టిన చందంగా జగన్ పంచన చేరి తెలుగుదేశం పార్టీని విమర్శించడంలో మాస్టర్ డిగ్రీ సంపాదించినట్లుగా చెలరేగిపోయారు. అయితే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మరీ ముఖ్యంగా రాజకీయాలలో  అయితే  మరీను. ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి కూడా అలాగే తయారైంది.  బలమైన క్యాడర్, సమర్థ నాయకత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు గన్నవరంఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ.. రెండో సారి ఎన్నికైన తరువాత పార్టీదేముంది? అంతా తన ప్రతిభేనని అనుకున్నారు. ఔను అచ్చం విజయవాడ ఎంపీ కేశినేని నానిలాగే.. అయితే నాని నిన్నమొన్నటి వరకూ గెలిచిన పార్టీలోనే ఉంటూ, పార్టీ విధానలను లెక్కచేయకుండా వ్యవహరించారు. చివరకు తెలుగుదేశం పార్టీయే మీ సేవలింక చాలని మర్యాదగా పక్కన పెట్టేసింది. అప్పుడు ఆయన రాజీనామా చేసి తానే బయటకు వచ్చేశానని గప్పాలు కొట్టుకుంటున్నారనుకోండి అది వేరే విషయం.

వల్లభనేని వంశీ మాత్రం రెండో సారి విజయం సాధించగానే, తన ప్రయోజనాలు అధికార పార్టీతో అంటకాగితేనే  భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతో జగన్ పంచన చేరిపోయారు. రాజకీయాలలో పార్టీలు మారడం సహజం. అందుకు ఎవరి కారణాలు వారికి ఉంటాయి. అయితే అలా పార్టీ మారిన వారు చెప్పే, చెప్పిన కారణాలు సహేతుకంగా ఉన్నాయని భావిస్తే జనం పార్టీ మారినా ఆదరిస్తారు. అలా కాకుండా స్వార్థ ప్రయోజనాల పరిరక్షణకే  ప్లేటు ఫిరాయించి తాను గెలిచిన పార్టీపైనే బురద జల్లుతున్నారని జనం భావిస్తే మాత్రం ఆ పార్టీ మారిన వ్యక్తికి ఇక రాజకీయ జీవితం ముగిసినట్లేనని దేశ వ్యాప్తంగా జరిగిన పలు జంపింగు నుతలను చూస్తే ఇట్టే అవగతమౌతుంది. 

మరీ ముఖ్యంగా తెలుగుదేశం వంటి కేడర్ ఆధారిత పార్టీలో అయితే పార్టీని కాదని పక్కకుపోయిన నేతల పరిస్థితి శంకర గిరి మాన్యాలే దిక్కు అన్నట్లుగా తయారౌతుంది. ఎన్టీఆర్ హయాం నుంచీ ఇది పదే పదే రుజువైంది. నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కోసం అమ్మలాంటి పార్టీని కాదని జంప్ చేసిన పలువురు ఆ తరువాత రాజకీయాలలో  అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఎన్నో. 

ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్ఖితి కూడా అలాగే తయారయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన వల్లభనేని వంశీ ఎప్పుడైతే పార్టీని కాదని వైసీపీ పంచన చేరారో ఆ రోజు నుంచే ఆయన రాజకీయ పతనం ఆరంభమైందని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. 

వంశీ విజయానికి కారణమైన తెలుగుదేశం, ఆ పార్టీ కార్యకర్తలూ ఎటూ వంశీకి దూరమయ్యారు. అలాగే.. ఆయన కోరి చేరిన వైసీపీలో కూడా ఆయన ఒంటరిగానే మిగలాల్సి వచ్చింది.  వైసీపీ గన్నవరం క్యాడర్ ఎవరూ వంశీని దగ్గరకు రానీయలేదు. యువకుడు, ఉత్సాహవంతుడు అన్న భావనతో గత ఎన్నికలలో వంశీవైపు మొగ్గు చూపిన న్యూట్రల్స్ కూడా ఇప్పుడు ఆయనను దగ్గరకే రానీయడం లేదు.  ఇక వైసీపీ అధిష్ఠానం కూడా వంశీని వదుల్చుకోవడమే బెటర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందుకు నిదర్శనమే రెండు సార్లు సొంత ఇమేజ్ తో గన్నవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యాను అంటూ చెప్పుకునే వంశీకి వైసీపీ ఈ సారి మొండి చేయి చూపాలన్న నిర్ణయానికి వచ్చేశింది.  దీంతో వంశీయే గత్యంతరం లేని పరిస్థితిలో పోటీ చేయను అంటూ ప్రకటించేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆయన ఆ ప్రకటన చేసినా చేయకపోయినా గన్నవరం నుంచి వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చేది లేదన్నది ఖాయమైపోయింది.

దీంతో గత కొంత కాలంగా వంశీ దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి. కనిపించడు, వినిపించడు అని వైసీపీ నేతలే ఆయనపై సెటైర్లు వేస్తున్నారు.  అసలు విషయం ఏమిటంటే గన్నవరం నుంచి పోటీకి జగన్ అసలు వంశీ పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. గత రెండు నెలలుగా వల్లభనేని వంశీ అసలు నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి. తెలుగుదేశం అగ్రనాయకత్వంపై వంశీ చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకు మిత్రులుగా ఉన్న వారు కూడా దూరం అయ్యిరని అంటున్నారు. ఇప్పుడు గన్నవరంలో వంశీ ఏకాకిగా మారిపోయారని, ఆయనను కలిసే వారు కానీ, పలకరించేవారు కానీ లేరని అంటున్నారు. అన్నిటికీ మించి వంశీ తనకు ఆప్తమిత్రుడిగా చెప్పుకునే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వంశీని పట్టించుకోవడం లేదని అంటున్నారు.