రూటు మార్చిన రేవంత్..లోక్ సభ ఎన్నికల్లో కాంగి‘రేస్’ఖాయం! | revanth speach in indravally| josh| party| cadre| congress| loksabha
posted on Feb 3, 2024 11:36AM
రేవంత్ రెడ్డి.. ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు టక్కున గుర్తుకొచ్చేది దూకుడు స్వభావం.. రాజకీయాల్లో దూకుడుగా ముందుకెళ్తూ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.. పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ పార్టీపై దూకుడుగా రాజకీయాలు చేస్తూ రేవంత్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కాంగ్రెస్ హైకమాండ్‌ను మెప్పించి, తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొంది సీఎం పీఠాన్ని అదిరోహించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రేవంత్ సీఎం అయ్యాక కొంచెం దూకుడు తగ్గించినట్లు కనిపించింది.. ఇదేమని రేవంత్ రెడ్డిని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో అడిగితే.. సీఎం పదవి అనేది హూందాతో కూడుకున్నది.. ఆవేశ పడకుండా.. నెమ్మదిగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కరిస్తూ వారి మెప్పును పొందేలా ముందుకు సాగాలని చెప్పారు.. కానీ, రేవంత్ సీఎం అయిన తరువాత ప్రత్యర్థులు కాస్త హుషారైయ్యారు. రేవంత్ ఇక దూకుడుగా వ్యవహరించరు, మనం ఏమన్నా పడుతూ.. తలదించుకుంటూ పోతరులే అనుకున్నారేమో.. ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో పడగొడతాం.. ఎంపీ ఎన్నికలు అయిన తరువాత మళ్లీ బీఆర్ ఎస్ దే అధికారం అంటూ కొందరు బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ప్రకటనలు చేశారు. చేస్తున్నారు. ప్రతిగా కాంగ్రెస్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ రాకపోవటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత ఆందోళన నెలకొంది.
ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వపోయే సరికి కాంగ్రెస్ శ్రేణులు నిరాశకు గురవుతున్నాయి. నిజంగానే ఆరు నెలలు , ఏడాదిలో ప్రభుత్వం కూలిపోతుందేమో.. ఎందుకొచ్చింది గొడవ.. బీఆర్ ఎస్ నేతల జోలికి వెళ్లకుండా మనపని మనం చేసుకుందాం అనుకునే స్థాయికి ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతలు వెళ్లిపోయారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి. తన అసలైన దూకుడు స్వభావాన్ని బయటకు తీసుకొచ్చారు. సీఎం పదవి అనేది హూందాతనంతో కూడుకున్నదే.. కానీ, ఆ పదవే మనల్ని నమ్ముకున్న వాళ్లను నిరుత్సాహ పరిచేలా ఉండటంతో ఆయన జూలు విదిల్చారు. అసలే కార్యకర్తలంటే ప్రాణమిచ్చే రేవంత్ రెడ్డి.. వాళ్లు నిరాశలో ఉంటే ఊరుకుంటారా? సీఎంగా హుందాగా ఉంటూనే పీసీపీ అధ్యక్షుడిగా.. తమ మాటల పదునూ చూపుతున్నారు. అలా చూపడానికి ఇంద్రవెల్లి గడ్డ ను వేదికగా చేసుకున్నారు.
మూడు నెలల్లో .. ఆరె నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయితడు అంటున్నరు.. నీ అయ్య.. ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది.. వేలాది మంది యువకులు ఉన్నారు.. మీరందరూ చూస్తూ ఊరుకుంటారా యువకులారా? ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాం అని మాట్లాడితే.. మీ ఊళ్లో యాపచెట్టుకు కోదండం వేసి కొట్టండి.. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. ప్రజలకోసం పనిచేస్తున్న ప్రభుత్వం.. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచేశారు. లక్షకోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ అనుకుంటున్నారు.. నీ అయ్య.. నువ్వు దోపిడీకి పాల్పడ్డం వల్లే కాళేశ్వరం గాలొస్తే కొట్టుకుపోయింది.. ఈ ప్రభుత్వం గాలి కాదుకదా.. మీ ఖాందాన్ మొత్తం వచ్చినా బోర్లబొక్కలేసి తొక్కుతాం.. ఆర్నెళ్లకో.. ఏడాదికో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటే పళ్లు రాలగొడతాం అంటూ.. బీఆర్ఎస్ కు గట్టి రిటార్డ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇన్నాళ్లు కొంత నిరాశతో ఉన్నకాంగ్రెస్ శ్రేణులు రేవంత్ తన సహజ దూకుడు ప్రదర్శించడంతో హురారయ్యారు. రేవంత్ ఉండగా.. ఎవడొస్తడు మన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అన్నట్లుగా రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మూడు నెలలు.. ఆరు నెలలు.. మహాఅంటే సంవత్సరంలో కూలిపోవటం ఖాయమని ప్రచారం చేస్తున్న బీఆర్ ఎస్ నేతలకు ఇంద్రవెల్లిలో రేవంత్ ప్రసంగం ఒక స్ట్రాంగ్ హెచ్చరిక చేసింది. ఇంద్రవెల్లిలో రేవంత్ మాట్లాడిన మాటలతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.. మరింత ఉత్సాహంతో ప్రభుత్వ పథకాలను అర్హులకు చేరవేస్తాం.. ఎవడు అడ్డొచ్చినా.. ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా వెనక్కు తగ్గం అనేలా.. రేవంత్ స్పీచ్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నిపింది.ఈ ఉత్సాహంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో విజయం కోసం రేసు గుర్రాల్లా దౌడు తీస్తాం అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు