Leading News Portal in Telugu

ఫార్మాసిటీ కథ కంచికి… లాభ‌ప‌డిందెవ‌రు? రేవంత్ యూట‌ర్న్ వెనుక ఆంధ్ర రియ‌ల్ ఎస్టేట్‌ | pharma city lands confused


posted on Feb 5, 2024 3:56PM

ఫార్మాసిటీ స్థానంలో మెగా టౌన్‌షిప్‌లతో కొత్త సిటీని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటివరకు సేక‌రించిన‌ 12,300 ఎకరాల భూముల్లో మెగా టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్ట‌నున్నారు. మ‌రో ప‌క్క  ఫార్మాసిటీ స్థానంలో 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్టుకు అనుసంధానం ఉండేలా ఓఆర్‌ఆర్‌, రీజినల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ఇవి రూపుదిద్దుకుంటాయి. ఒక్కో ఫార్మా విలేజ్‌ రెండు వేల నుంచి మూడు వేల ఎకరాల్లో ఉంటుంది.

వంద శాతం కాలుష్యరహితంగా ఉండే పరిశ్రమలతో పాటు వాటిలో పనిచేసేవారి నివాస సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద(ఎంటర్‌టైన్‌మెంట్‌) విభాగాలు సహా అన్నీ ఫార్మా విలేజ్‌లో ఉంటాయి. 

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీని ఎందుకు ర‌ద్దు చేయం. స‌రి చేస్తున్నార‌ట‌. అందులో భాగంగానే 10 ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సి.ఎం. నిర్ణ‌యం వెనుక మ‌త‌ల‌బు ఏమిటి?

ఫార్మా సిటీ మాటున పెద్దల భూదందా, ఇన్‌సైడ్ ట్రేడింగ్ జ‌రిగింద‌ట‌. తక్కువకు కొని అధిక ధరకు ప్ర‌భుత్వానికే అమ్ముకున్నార‌ట‌. 

2017లో హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. 

రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూర్, కడ్తాల్, ఆమన్‌గల్‌ మండలాల్లోని పది గ్రామాల పరిధిలో 19,333 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పటికే 12,300 ఎకరాల భూసేకరణ కూడా పూర్తైంది. 

ఇందులో సుమారు 9,400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నది. 

మిగిలిన పట్టా, అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం పలు మార్గాల్లో పరిహారం ఇచ్చింది. 

పట్టా భూములు ఇచ్చిన వారికి ఎకరాకు రూ.18 లక్షలతో పాటు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటు (ఒక గుంట), ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. 

కోర్టును ఆశ్రయించిన కొందరు రైతులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.26 లక్షలు వచ్చాయి. 

అసైన్డ్‌ భూములు కోల్పోయినవారికి ఎకరాకు రూ.7.50-8.00 లక్షలు ప్రభుత్వం చెల్లించింది. 

వీరికి ఎకరాకు అభివృద్ధి చేసిన 121 గజాల ప్లాటుతోపాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. 

ఈ మేరకు నగదు పరిహారం గతంలోనే చెల్లించింది. 

సేకరించిన భూముల్లోనే 600 ఎకరాల మేర లేఅవుట్‌ను అభివృద్ధి చేసి, భూములు ఇచ్చిన వారికి ప్లాట్లను పంపిణీ కూడా చేశారు.

 ఫార్మాసిటీ వాసన పసిగట్టిన ‘పెద్ద గద్దలు’ చురుగ్గా కదిలాయి. దాని చుట్టూ వాలిపోయాయి. స్థానిక రైతుల్ని కాలుష్యం పేరిట, ప్రభుత్వం భూమి సేకరించబోతుందంటూ మభ్యపెట్టాయి. ప్రభుత్వంలోని పలువురు ఉన్న తాధికారులతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదిత ఫార్మాసిటీ చుట్టూ పెద్ద ఎత్తున భూములు తక్కువ ధరకు కొనుగోలు చేశారు. పట్టా భూములు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కూడా వారి ఖాతాల్లో జమ చేసుకున్నారు.

ఆ తర్వా త ఈ భూములనే ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా ప్రభుత్వానికి అధిక ధరకు అప్పగించి పెద్దెతున లబ్ధి పొందారు. అప్పటివరకు తమ చేతు ల్లో ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసుకున్నా రు. మాజీ సీఎస్‌ సోమేష్‌కుమార్‌, అత‌ని కుటుంబ‌స‌భ్యులు 300 ఎక‌రాలు కొనుగోలు చేశార‌ట‌.

ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో టీఎస్‌ఐఐసీ విశాలమైన రహదారులు, భూగర్భ డ్రైనేజీ, ఇతరత్రా మౌలిక వసతుల కల్పనతో అభివృద్ధి పనులు చేశారు. 

కందుకూరు పరిధిలో 180 ఎకరాలు సబ్‌ స్టేషన్‌కు కేటాయించారు. 

30 ఎకరాలకు ప్రభుత్వ వైద్య కళాశాలకు కేటాయించారు. 

48 ఎకరాలను అమెజాన్‌ డాటా సెంటర్‌కు ఇచ్చారు. ఇందులో రూ.5,809 కోట్లతో డాటా సెంటర్‌ ఏర్పాటవుతున్నది. మిగిలిన భూముల్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకుగాను సుమారు 300-350 కంపెనీలు ముందుకొచ్చాయి.