రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు ముందస్తు గండం!? | jagan fear about rajyasabha elections| sittings| change| mlas| dissidence| cross
posted on Feb 5, 2024 12:06PM
ఏపీ ముఖ్యమంత్రి మరో సారి అధికారంలోకి రావడం ఎలాగో తెలియక ఆందోళనలో ఉండి.. సిట్టింగుల మార్పు ప్రయోగంతో ఉన్న అవకాశాలను చేజార్చుకుంటూ బెంబేలెత్తుతుంటే.. మరో వైపు అసలు పోరుకు ముందు జరిగే రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టి గెలిచి జగన్ కు చావు దెబ్బ కొట్టాలన్న వ్యూహాలతో తెలుగుదేశం, జనసేన కూటమి కార్యాచరణ ప్రారంభించింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బాబలాలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఎన్నికలు జరగనున్న మూడు రాజ్యసభ స్థానాలలోనూ వైసీపీ సునాయాసంగా విజయం సాధిస్తుంది.
అయితే అలా గెలిచేస్తామన్న నమ్మకం మాత్రం అధికార వైసీపీలో ఇసుమంతైనా కనిపించడం లేదు. జగన్ తీరుతో విసుగెత్తి కొందరు, అసంతృప్తితో మరి కొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేయగా, పార్టీలోనే ఉన్నవారిలో పలువురు జగన్ కు వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు అధికార పార్టీ వర్గాలే డంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుని జగన్ కు అసలు ఎన్నికల వేళ భారీ ఝలక్ ఇచ్చి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలన్న కృత నిశ్చయంతో ఉంది. అందుకే రాజ్యసభ ఎన్నికల విషయంలో టీడీపీ ప్రణాళికా బద్ధంగా అడుగులు వేస్తోంది. వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థిని అంటూ నిలబెడితే గెలిచి తీరాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎన్నికలపై పార్టీ ఒక బృందాన్ని నియమించి అభ్యర్థి విజయంపై కసరత్తు మొదలెట్టేసింది. ఆ బృందం ఇప్పటికే అధికార పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలతో టచ్ లో ఉందని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలం ఎంత, ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తులలో ఎంత మంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారు. వంటి అంశాలపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నది.
ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తాము తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పినట్లు తెలుస్తోంి. మరికొందరు తెలుగుదేశంలోకి టచ్ లోకి వచ్చారు. ఇంకొందరు జనసేనతో టచ్ లోకి వెళ్లారు. దీంతో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చేసింది. అయితే ఎవరిని పోటీలో నిలబెడుతుంది అన్న విషయంలో మాత్రం ఎలాంటి లీకులూ లేవు. అభ్యర్థి పేరును చివరి క్షణం వరకూ గోప్యంగా ఉంచాలని తెలుగుదేశం భావిస్తోంది. ప్రస్తతం జగన్ రెడ్డి సీట్ల మార్పు కార్యక్రమంతో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలలో వ్యూహాత్మకంగా అవకాశం లేకపోయినా పంచుమర్తి అనూరాథను అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్న తెలుగుదేశం ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలలోనూ అంతే వ్యూహాత్మకంగా అభ్యర్థిని రంగంలోకి దింపేయాలని భావిస్తోందని చెబుతున్నారు. సిట్టింగుల మార్పు అంటూ జగన్ మార్పులతో ఆయన పార్టీపై దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఇప్పటి వరకూ చేసిన మార్పులలో అత్యథికంగా 28 దళితులే ఉన్నారు. దీంతో వారంతా రాజ్యసభ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిని నిలబెడితే ఆయనకే మద్దతు ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలా నిలబెట్టే అభ్యర్థి దళితుడైతే ఇక సందేహానికి తావులేని విధంగా వారంతా వారంతా తెలుగుదేశశం అభ్యర్థికి మద్దతుగా ఓటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం రాజ్యసభ ఎన్నికలలో దళిత అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ అండ్ కో లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవతున్నది. నియోజకవర్గాలలో సిట్టింగుల మార్పు కార్యక్రమానికి విరామం ప్రకటించి తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయాన్ని ఆరా తీయడంలో పడ్డారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల భయంతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల మార్పు విషయంలో కూడా పునరాలోచించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. మొత్తం మీద అసలు ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికల రూపంలో జగన్ కు పెనుగండం పొంచి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.