posted on Feb 5, 2024 10:34AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరించాయి. ఖరారైన అభ్యర్థుల పేర్లను అన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. అధికార వైసీపీ ఇప్పటికే పలు జాబితాలను విడుదల చేసింది. . ఇక జనసేనతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచిన విపక్ష టీడీపీ.. కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా కావ్య కృష్ణా రెడ్డి పేరు ఖరారు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కావలి నియోజకవర్గానికి కావ్య కృష్ణా రెడ్డిని ఇన్చార్జ్గా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. కావ్య ఇంటివద్ద టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కావలిలో కావ్య కృష్ణారెడ్డికి మంచి పట్టు ఉంది. టిడిపి జనసేన పొత్తు నేపథ్యంలో కావలి స్థానం నుంచి టిడిపి పోటీ చేయవచ్చన్నవార్తలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి బరిలోకి దిగుతుండడం తో సీట్ల సర్దుబాటు కాస్త ఆలస్యం అవుతుంది. ఇరు పార్టీల నేతలతో మాట్లాడి , అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చెరో రెండు , రెండు స్థానాలను ప్రకటించడం జరిగింది.నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ బలంగా ఉంది. చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న కావలి నియోజకవర్గం పేరు ఖరారు కావడంతో వైసీపీ శ్రేణుల్లో భయం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో కావలి స్థానాన్ని వైసీపీ కోల్పోవల్సి వస్తుందని ఫ్యాన్ పార్టీ డిసైడ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. . కావలిలో ఫ్యాన్ పార్టీకి అభ్యర్థులు కొరవడటంతో టిడిపి గెలుపు ఖాయమనే ప్రచారం మొదలైంది.