Leading News Portal in Telugu

రెండో రోజు  ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. అంతలోనే తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెండ్ 


posted on Feb 6, 2024 10:33AM

నిరసన మన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఎలాగూ ఆస్కారం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ప్రజల గొంతుకగా మారి అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయడమే పాపమైంది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు వాకౌట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు రెండో రోజు మాత్రం ప్రజాస్వామ్య బద్దంగా చర్చను చేపట్టాలని నిరసస వ్యక్తం చేయడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హాయంలో స్పీకర్ పదవికి విలువే లేకుండా పోయింది. రాజ్యాంగపదవిలో ఉన్న స్పీకర్ మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యలు ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని… ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే, టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్ పట్టించుకోలేదు. 

మరోవైపు, టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకుపోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులు… బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో శాసనసభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్ సస్పెండ్ చేశారు.