ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్ | highcourt fire on ap police| parchuru| mla| aluri| sambasivarao| mining| question| case| arrest| anticipatory
posted on Feb 6, 2024 3:32PM
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ కు కోర్టులంటే లెక్క లేదు. తన ఇష్టారాజ్యంగా పాలన సాగించేందుకు అధికారులను తొత్తులుగా మార్చుకుంది. మాట వినే వారే కీలక పదవులలో నియమించుకుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో కీలక అధికారులంతా విధినిర్వహణలో కంటే జగన్ సేవలోనే తరిస్తున్నారని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. కోర్టులు ఎన్ని సార్లు చీవాట్లు పెట్టినా దులిపేసుకుంటున్నారు.
తాజాగా ఏపీ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పోలీసుల పని తీరు మెరుగుపడాలంటే.. ఓ ఉన్నతాధికారిని జైలుకు పంపక తప్పదా అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించిందంటే.. ఏపీలో పోలీసులు ఎంత సుందరముదనష్టంగా పని చేస్తున్నారన్నది ఇట్టే అర్ధమౌతుంది. రాష్ట్రంలో కిడ్నాపర్నకు అండ, గంజాయి స్మగ్లర్లకు మద్దతు, విధినిర్వహణలో రాజ్యాంగ ఉల్లంఘనలు.. అమాయకులపై వేధింపులు, అక్రమ కేసుల నమోదు ఇలా పోలీసు వ్యవస్థ పనితీరు పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ వారు చేసిన తప్పులకు కూడా విపక్షాల కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేస్తూ మొత్తంగా ఏపీలో పోలీసులు వైసీపీ హార్డ్ కోర్ కార్యకర్తలుగా పని చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అరెస్టునకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పర్చురులో క్వారీలపై మైనింగ్ శాఖ అధికారుల సోదాలలో కొందరు ప్రైవేటు వ్యక్తులు సైతం పాల్గొన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గట్టిగా ప్రశ్నించారు. అంతే ఏపీలోని ప్రైవేటు రాజ్యాంగం జూలు విదిల్చింది. పోలీసులు రంగంలోని దిగి ఆయనపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులు కూడా ఇవ్వకుండా తనను అరెస్టు చేయడానికి పోలీసులు చూస్తున్నారనీ, రాష్ట్రంలో పోొలీసులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కోర్టుకు వెళ్లారు. ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ విచారణ చేసిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలే పోలీసులు అరెస్టు చేస్తారంటూ భయపడుతున్నారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడే కేసులలో 41 ఏ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని చట్టం స్పష్టంగా చెబుతుంటే అరెస్టు ఎలా చేస్తారని నిలదీసింది. అలా అరెస్టు చేస్తే అందుకు బాధ్యులైన వారు తీవ్రపరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది.
ఏపీలో పోలీసుల తీరు మారాలంటే ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశించాల్సి వచ్చేటట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇక ఏలూరి సాంబవివరావు కేసు విషయంలో వివరాల సమర్పణకు ప్రభుత్వ న్యాయవాది సమయం కోరడంతో కేసు విచారణను వాయిదా వేసింది. కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఏపీలో పోలీసులు ప్రభుత్వ పెద్దల కనుసైగల మేరకు వ్యవహరిస్తున్నారని అవగతమౌతుంది. వారికి ఇష్టం లేనివారిపై అక్రమ కేసుల బనాయించి ఏదో ఒక విధంగా అరెస్టు చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రసంగించారనీ, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారనీ, అవినీతికి పాల్పడ్డారనీ ఆరోపిస్తూ కనీస సాక్ష్యాలు కూడా లేకుండా అరెస్టు చేస్తున్నారు. ఈ తీరు ఇప్పడు తార స్థాయికి చేరింది. ఎన్నికల ముందు విపక్షాలకు చెందిన నేతలు ప్రజల మధ్య ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకుని అక్రమ అరెస్టులకు తెరతీస్తున్నది. దీనిపైనే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అయితే కోర్టుల అక్షింతలను పట్టించుకునే పరిస్థితి ఏపీలో లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే డీజీపీని జైలుకు పంపినా జగన్ అధికారంలో ఉన్నంత వరకూ ఏపీలో పోలీసులు మారరని అంటోంది.