భగీరథలోనూ భారీ అవినీతి.. ఫిర్యాదులపై రేవంత్ సర్కార్ నజర్ | corruption in mission bhagiratha| revanth| sarkar| orders| vigilense
posted on Feb 7, 2024 11:33AM
బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో కూడా భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి భగీరద అవినీతిపై ఫిర్యాదులు అందాయి. నేరుగా సీఎంవోకే ఈ ఫిర్యాదులు చేరడంతో ప్రభుత్వం వీటిపై సీరియస్ గా దృష్టి సారించిందని తెలుస్తోంది. ముఖ్యంగా పైపులైన్ల ఏర్పాటులో భారీ స్కాం జరిగిందనీ, ఈ స్కాం విలువ 7 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంటున్నారుగ్రామాల మధ్య ఏర్పాటు చేసిన పైపులైన్లలో రూ.వేల కోట్లు కొల్లగొట్టున్నట్టు సీఎంఓకు కంప్లయింట్స్ వెళ్లాయి. ఇందులో దాదాపుగా రూ.7వేల కోట్ల అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భగీరథ అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ దర్యాప్తునకు సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించే పథకాన్నిగత బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ఆరంభించింది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సుమారు రూ.30 వేల కోట్ల మేరకు ఇందు కోసం అప్పులు చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఊరికి కొత్తగా పైపు లైన్లు ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి 90 శాతానికి పైగా గ్రామాలకు తాగునీటి సరఫరా సౌకర్యం ఉంది. ఇక్కడే భారీ అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలకు కొత్త పైపు లైన్లు వేయకుండానే వేసినట్లుగా కాంట్రాక్టు సంస్థ పెట్టిన బిల్లులకు చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మెటీరియల్ కొనకుండానే కోట్ల రూపాయల బిల్లులు సృష్టించి దండుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పటికే ఓవర్ హెడ్ ట్యాంకులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఉన్నా.. లెక్కల్లో మాత్రం కాంట్రాక్టర్లు వాటిని కొత్తగా ఏర్పాటు చేసినట్టు చూపించినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పడు వీటిపైనే విజిలెన్స్ దర్యాప్తు చేపట్టినట్లు చెబుతున్నారు.