కెసిఆర్ కు కలిసి రాని యాగం.. మరి జగన్ హాజరవుతారా? | rajasyamala yagam incompatible to kcr| jagan| saradapeetham| aniversary| invite
posted on Feb 7, 2024 12:20PM
ప్రతి ఏటా విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు ఐదు రోజులు పాటు నిర్వహిస్తారు. అందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు వార్షికోత్సవాలను నిర్వహించనున్నారు. చివరి రోజు రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. 2014 – 2023 మధ్యలో మూడు సార్లు తెలంగాణ మాజీ సి.ఎం. కేసీఆర్ రాజశ్యామల యాగం చేశారు.
1. 2015లో కేసీయార్ యాగం చేశారు. అప్పట్లో ఆయన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని యాగం చేశారు.
2. 2018లో ముందస్తు ఎన్నికల ముందు మరోసారి రాజశ్యామల యాగం చేశారు. అప్పుడు ఆయన విజయవంతంగా రెండవసారి ముఖ్యమంత్రి అయిపోయారు.
3. 2023 నవంబర్లో మూడవసారి రాజశ్యామల యాగం చేశారు. మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిచి దక్షిణ భారత దేశంలో వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఈ యాగం చేశారు.
ఇక…..ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా 2019 లో రాజశ్యామల యాగం నిర్వహించారు. బంపర్ మెజారిటీతో సీఎం అయ్యారు. అంతే కాదు ఆ ఏడాది విజయవాడలో వారం పది రోజుల పాటు రాజశ్యామల అమ్మవారి యాగంతో పాటు దేవీ దేవతలకు హోమాలు పూజలు జరిగాయి. దేవాదాయ శాఖ ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు.
2024లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మ నందేంద్ర స్వామి సీఎం జగన్ ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా హాజరు అవుతారా? లేదా అనే చర్చ జరుగుతోంది.
ఎందుకంటే కెసిఆర్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారని చెప్పి స్వరూపానందేంద్ర స్వామి రాజశ్యామల యాగం చేయించారు. అయితే ఆయన ఓడిపోయారు. అధికారం కోల్పోయారు.
స్వరూపానందేంద్ర స్వామి అంటే కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం, నమ్మకం వుంది. కానీ స్వామి చెప్పినట్టుగా కెసిఆర్ అధికారంలోకి రాలేకపోయారు. స్వామీజీ ఒకలా దీవిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులతో అధికారంలోకి వస్తారు అనుకున్న కెసిఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. దీంతో స్వామీజీ జోష్యానికి కాస్త ఇబ్బందులు వచ్చాయి.
ఈ నేపథ్యంలో రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్… స్వామీజీని నమ్ముతారా? నమ్మి వార్షికోత్సవ వేడుకలకు హాజరవుతారా? మరోసారి రాజశ్యామల యాగాన్ని జరిపి.. అధికారాన్ని అందుకోగలరా? అన్న చర్చ ఏపీలో జరుగుతోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా సరైన సమయం చూసి రాజశ్యామల యాగం చేస్తుందంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.