posted on Feb 7, 2024 9:40AM
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తల్లి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ కుమార్తె అయిన భువనేశ్వరి ఇంత కాలం ప్రజాక్షేత్రంలో పని చేసింది లేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టింది లేదు. కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నారు. అయితే అధికార వైసీపీ కుట్ర, కక్ష పూరిత విధానాలతో తన భర్త, తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడి అరెస్టుతో ఆమె జనం మధ్యకు వచ్చారు. తన కుటుంబాన్ని కక్షపూరిత విధానాలతో అధికార జగన్ పార్టీ వేధిస్తోందని గళమెత్తారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె తొలి సారి ప్రజల మధ్యకు వచ్చారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, దాదాపు అంతే కాలం విపక్ష నేతగా, గత నాలుగు దశాబ్దాలుగా దేశ రాజకీయాలలో ప్రతి మలుపులోనూ క్రియాశీలంగా వ్యవహరించి , దార్శనికుడిగా దేశ, విదేశాల గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబును కనీసం నోటీసులు లేకుండా, చార్జిషీట్ లో పేరు లేకుండా అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు పట్ల సర్వత్రా నిరసనలు, ఆగ్రహ జ్వాలలూ వ్యక్తం అయ్యాయి. ఆయన అరెస్టుకు కలత చెంది రాష్ట్రంలో పలువురు అసువులు బాశారు. అటువంటి వారి కుటుంబాలను పరామర్శించేందుకు నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలుగా నిజం గెలవాలి యాత్ర చేసిన భువనేశ్వరి.. చంద్రబాబు అరెస్టుతో కలత చెంది ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆర్థిక సమాయం అందజేశారు. మూడో విడత యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి మంగళవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఆమెకు నియోజకవర్గంలో ఘనస్వాగతం లభించింది. భువనమ్మ పరామర్శించే ప్రతి కార్యకర్త కుటుంబం వద్ద పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్దఎత్తున భువనమ్మకు ఘన స్వాగతం పలికారు. నిజం గెలవాలి….నిజమే గెలవాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మంగళగిరి పట్టణంలో మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. పెనుమాక గ్రామంలో భువనమ్మకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. పెనుమాక సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి భువనమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తనకు పెద్దఎత్తున సంఘీభావం తెలిపిన పెనుమాక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. భువనమ్మ పర్యటన ప్రారంభం నుండి ముగింపు వరకు యువత పెద్దఎత్తున కేరింతలు కొడుతూ భువనమ్మకు తోడుగా నడిచారు. భువనమ్మ పర్యటించిన 7 గ్రామాలతో పాటు పెదవడ్లపూడి, దుగ్గిరాల, రేవేంద్రపాడు, మంగళగిరి పట్టణం, పెనుమాక గ్రామాల ప్రజలు భువనమ్మకు ఘనస్వాగతం పలికారు. మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన భువనమ్మ తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువతకు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగారు.
అయితే వాస్తవానికి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కంటే ముందే ప్రజల ముందుకు వచ్చారు. పార్టీ ముఖ్యులతో చర్చలు జరిపారు. అదెప్పుడంటే.. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు , ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను వేధింపులకు గురి చేస్తుంటే.. ఆ సమయంలో పార్టీని ముందుండి నడిపించేందుకు, ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఆమె కొంగు బిగించారు. అరెస్టులు, కేసులు, వేధింపుల కారణంగా అప్పట్లో చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు కొంత సమయం పడుతునందన్న ఊహాగానాల నేపథ్యంలో నారా భువనేశ్వరి ముందుకు దూకారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సంసిద్ధు రాలయ్యారు. ఆమెతో పాటు కోడలు అంటే నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అనర్గళంగా ప్రసంగించారు. అలాగే నారా భువనేశ్వరి పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ర్యాలీకి సైతం రెడీ అయ్యారు. చంద్రబాబు నిర్బంధంలో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం వేదికగా నారా భువనేశ్వరి పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు.
కుటుంబ వ్యాపారం చూసుకోవడం తప్ప గతంలో ఎన్నడూ రాజకీయాలతో సబంధం లేకుండా ఉన్న భువనేశ్వరి పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వారిని కలిసి వారితో మాట్లాడారు. రొటీన్ రాజకీయ ప్రసంగాలకు భిన్నంగా సూటిగా తడబాటు, తొట్రుపాటు లేకుండా చంద్రబాబు అరెస్టు ఎంత అక్రమమో, ఎంత అప్రజాస్వామికమో వివరించారు. అదే సమయంలో జగన్ సర్కార్ అకృత్యాలు, అక్రమాలను ధైర్యంగా ఎండగట్టారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య రాదనీ, తాను ఉన్నాననీ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. మాటలకే పరిమితం కాకుండా చేతలలో కూడా కూడా పార్టీకి అండదండగా ఉంటామన్న ధైర్యాన్నీ, ధీమాను ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రజాక్షేత్రంలో పర్యటనలు చేస్తున్నారు. వారితో ముఖాముఖీ మాట్లాడుతున్నారు. సౌమ్యంగానే అయినా సూటిగా జగన్ ప్రభుత్వం అరాచకాలు, అకృత్యాలు, అవినీతి, అక్రమాలను ఎండగడుతున్నారు.