Leading News Portal in Telugu

బందర్ లో పేర్ని కిట్టూ… అంత వీజీ కాదు! | bandar not easy to penni kittu| win| jagan| sarkar| nani| facing| people


posted on Feb 7, 2024 2:53PM

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రం బందరులో రాజకీయం రూపు రేఖలు ఒక్కసారిగా మారి పోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి అలియాస్ పేర్ని కిట్టు బరిలో దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు. కుమారుడి కోసం తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు పేర్ని నాని చెబుతున్నారు. అయితే అంత త్యాగం చేసినా బందర్ లో పేర్ని కిట్టు.. గెలుపు అంత వీజీ కాదని రాజకీయవర్గాలు అంటున్నాయి. తొలిసారిగా ఎన్నికల బరిలో  దిగుతున్న కిట్టూ విజయం ఏమాత్రం సులువు కాదని అంటున్నారు.  

 జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత , అలాగే  కిట్టూ  తండ్రి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని  జగన్ కేబినెట్‌లో రవాణ, సినిమాటోగ్రఫీ మంత్రిగా పని చేసినా.. ఆయన.. ఆయా శాఖల మంత్రిగా ఏంచేశారో ఏమో కానీ, నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు అంటున్నారు. అంతే కాదు పేర్ని నాని తండ్రి అంటే.. పేర్ని కిట్టు తాత.. పేర్ని కృష్ణమూర్తి సైతం.. బందరు ఎమ్మెల్యేగానే కాకుండా.. మంత్రిగా కూడా పని చేశారని.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బందరు ఎలా ఉందో.. ఇప్పటికీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా అలాగే ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. 

ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొల్లు రవీంద్ర పోటీ చేయనున్నారు. ఆయన గతంలో అంటే.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా  పని చేశారు. అదే విధంగా బందరు లోక్‌సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి బరిలో దిగనున్నారనే ఓ ప్రచారం నడుస్తోంది. మరోవైపు బందరు ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే సింహాద్రి రమేష్ బాబు పేరును జగన్ పార్టీ ఖరారు చేసింది.

ఇక బందరుకు కూత వేటు దూరంలోని పెడన అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొనకళ్ల నారాయణను బరిలో నిలిపే అంశాన్ని తెలుగుదేశం అధిష్టానం పరిశీలిస్తోంది. అదీకాక జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చాలా బలంగా ఉండటం, ప్రతిపక్ష నేతగా ఆయన పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చానా..   ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత వాటిని తుంగలోకి తొక్కి ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పేర్ని నాని ఎమ్మెల్యేగా ఉన్నా.. మంత్రిగా ఉన్నా..   సీఎం వైయస్ జగన్‌పై ఈగ కూడా వాలనియకుండా ఉండేందుకు చూపించిన శ్రద్దాసక్తులలో వందో వంతు  బందరు నియోజకవర్గ అభివృద్ధిపై పెట్టినా.. ఎంతో కొంత మేలు జరిగేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల్లోవిజయం సంగతి అలా ఉంచితే బందరులో పేర్ని కిట్టు విజయం మాత్రం అంత సులువు కాదని అంటున్నారు.