విజయసాయి రెడ్డి గూబ గుయ్యిమనేలా కాంగ్రెస్ రిటార్డ్ | strong retard to vijayasai| congress| government| telangana| fall
posted on Feb 8, 2024 4:59AM
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటి దురుసు కాస్త ఎక్కువే. ఈ విషయాన్ని వైసీపీ నేతలుకూడా అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షాలపై ఇష్టారీతిలో మాట్లాడటం ఆయనకు అలవాటే. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటినుంచి సత్య దూర వ్యాఖ్యలతో పలు వివాదాలు కొనితెచ్చుకున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల మెప్పు కోసం విజయసాయిరెడ్డి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియని విషయం కాదు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులతోపాటు తెలంగాణ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.. విజయసాయికి గూబ గుయ్యిమనేలా సమాధానం ఇచ్చారు. నీ బుద్ది మారకుంటే తగిన శాస్త్రి తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత పదేళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమై పట్టుమని మూన్నెళ్లుకూడా కాలేదు.. అయినా, రేవంత్ సారథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేస్తున్నారు. ముఖ్యంగా.. ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తోంది. గడిచిన రెండు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల్లో ఆదరణ పెరిగింది. మరోవైపు గత ప్రభుత్వం అవినీతి అక్రమాలను రేవంత్ సర్కార్ వెలుగులోకి తెస్తోంది. ఈ పరిణామాలు తట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగుతున్నారు. మరికొద్ది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని వ్యాఖ్యానిస్తూ ప్రజల్లో మరింత అభాసుపాలవుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి తనది కాని సబ్జెక్ట్ లోకి దూరిపోయాడు. ఆయనకు నోటి దురుసు కాస్త ఎక్కవనే విషయం తెలిసిందే కదా.. తెలంగాణ ప్రభుత్వంపై నోరుపారేసుకున్నాడు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో విజయసాయి రెడ్డి మాట్లాడారు. పదేళ్ల తరువాత అనేక అబద్ధాలు చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అక్కసు వెల్లగక్కారు.. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించాడు. ఇదంతా బీజేపీ మెప్పుకోసం మాట్లాడిన మాటలే అయినా.. విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్లో మరో ఆందోళన కనిపించింది. ఇన్నాళ్లు జగనన్న బాణంగా రాజకీయాల్లో కొనసాగిన ఆయన సోదరి వైఎస్ షర్మిల ఎదురు తిరిగి.. ఏకంగా ఏపీలో జగనన్నకు వ్యతిరేకంగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. అడుగడుగునా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వైసీపీ నాయకత్వానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నారు. దీంతో.. షర్మిలపై కోపాన్ని తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి వెళ్లగక్కినట్లు ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఊరుకుంటారా.. విజయసాయిరెడ్డి గూబ గుయ్యిమనేలా కౌంటర్ ఇచ్చారు.
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడా? బ్రోకర్ పనిచేస్తున్నాడా?. బీజేపీ డైరెక్షన్ లో జగన్, కేసీఆర్ పని చేస్తున్నారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందవద్దని కేసీఆర్, కేటీఆర్, జగన్ కుట్ర చేస్తున్నారంటూ ఓ రేంజ్ లో విమర్శలు చేశారు. బీజేపీ, జగన్, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడతాం.. పార్లమెంట్ ఎన్నికలలోపు బీఆర్ ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామంటూ జగ్గారెడ్డి హెచ్చరించారు. మరో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ విజయసాయిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయికి ఏ రాజకీయ తెలివి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది.. షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్ ను బలోపేతం చేయడం అనేది విజయసాయికి నచ్చకపోవచ్చు.. అందుకే కాంగ్రెస్ పై అక్కసు వెల్లబుచ్చుకుంటున్నారు.. రాబోయే కాలంలో సరైన రీతిలో గుణపాఠం చెబుతామని అద్దంకి దయాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నాయి. మొత్తానికి విజయసాయి రెడ్డికి గూబ గుయ్యిమనేలా కాంగ్రెస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇకనైనా మారు సామి.. అంటూ హితవు పలుకుతున్నారు.