షర్మిల ప్రాణాలకు ముప్పు? చెల్లికి రక్షణ కల్పించలేవా జగన్! | threat to sharmila| jagan| security| congress| worry| netizens| remind| viveka
posted on Feb 8, 2024 8:33AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడంతో పాటు.. తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా కాంగ్రెస్ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించిన షర్మిల.. తాజాగా బహిరంగ సభల పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చే క్రమంలో షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై జనబాహుల్యంలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వైసీపీలో బూతుల నేతలు ఎక్కువగానే ఉన్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆమెపై బూతుల పంచాగంతో విరుచుకుపడుతున్న వైసీపీ నేతలు 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి సీఎం పీఠం ఎక్కగలిగాడంటే అందులో షర్మిల పాత్ర కీలకమన్న విషయాన్ని మర్చిపోతుండటం సిగ్గుచేటు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే అందులో షర్మిల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరికైనా ఈ విషయం తెలిసిందే. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అక్రమాస్తుల కేసులో సంవత్సరానికిపైగా జైలుకెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను షర్మిల భుజానికెత్తుకున్నారు. అంతేకాదు.. పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాపులర్ రాజకీయ నేతగా ఎదిగారు. ఎన్నికల సమయంలో షర్మిల, జగన్ తల్లి విజయమ్మ ప్రచారంతో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి క్రమంగా షర్మిలను పక్కకు పెడుతూ వచ్చారు. దీనికితోడు ఆస్తి పంపకాల విషయంలోనూ విబేధాలు రావడంతో జగన్, షర్మిల శ్రుతువులుగా మారిపోయారు. ఆ తరువాత షర్మిల తెలంగాణలో తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ పేరుతో రాజకీయాలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో తన సొంత పార్టీని విలీనం చేసి ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో షర్మిల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. జగన్ ప్రభుత్వంలో ఏవర్గాల వారికి న్యాయం జరగలేదని తేల్చారు. జగన్ పరిపాలన చేసేందుకు అర్హుడు కాదంటూ విమర్శించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ శ్రేణులు షర్మిలకు వ్యతిరేకంగా అసభ్యకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కొందరు వైసీపీ నేతలు అన్నా.. షర్మిల అడ్డు తొలగించెయ్యరాదన్నట్లు జగన్ కు సూచనలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులుసైతం పెట్టే స్థాయికి వెళ్లిపోయారు. మరికొందరు.. షర్మిల అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత కుమార్తేనా అంటూ అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎంత బద్దశత్రువులైనా సొంత చెల్లిని అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఎవరూ చూస్తూ ఉండరు. కానీ జగన్ షర్మిలపై అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నంకూడా చేయకపోవటం అటుంచి వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా వ్యవహరిస్తుండటంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు షర్మిలకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తరపున సెక్యూరిటీ కల్పించాలని కోరినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిల, విజయమ్మకు సెక్యూరిటీ ఉండేది. తరువాత కాలంలో ఆ సెక్యూరిటీని తొలగించేశారు. ప్రస్తుతం షర్మిల ప్రాణాలకు ముప్పు పొంచిఉందని కాంగ్రెస్ నేతలు, ఆఖరికి పలువురు టీడీపీ నేతలుసైతం పేర్కొంటున్నారు. అయినా షర్మిలకు భద్రతను కల్పించేందుకు జగన్ నిర్ణయం తీసుకోకపోవటం జగన్ మూర్ఖత్వానికి అద్దం పడుతున్నదని పలువురు వైసీపీ నేతలుసైతం విమర్శిస్తున్నారు. తాజాగా.. తన భద్రత విషయంలో ఏపీ సీఎం జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు సెక్యూరిటీ కల్పించకపోవడం అంటే.. తన చెడు కోరుకుంటున్నారనేగా అర్థం అని షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల వ్యాఖ్యలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది. జగన్ ఇప్పటికైనా తన మూర్ఖత్వాన్ని వీడి షర్మిలకు భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తన మూర్ఖత్వ రాజకీయాలతో ప్రత్యర్థులపై కక్షపూరితంగా వ్యవహరించే జగన్.. చెల్లి షర్మిలపై కూడా అలాగే వ్యవహరించడం విస్మయం గొలుపుతోంది. గత ఎన్నికల ముందు సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ హత్యను కూడా తన రాజకీయ లబ్ధికి వాడేసుకున్న జగన్ తీరా గెలిచిన తరువాత హత్యకు కారకులైన వారి పక్షాన నిలిచి అడుగడుగునా ఆ కేసు దర్యాప్తునకు అవరోధాలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు మళ్లీ మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు జరగనున్న తరుణంలో సొంత చెల్లి షర్మిల తన భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అయినా భద్రత విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో సొంత చెల్లికి సైతం భద్రత కల్పించని వ్యక్తి జగన్ అటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గత ఎన్నికల ముందు జరిగిన బాబాయ్ హత్య ఉదంతాన్ని పేర్కొటూ షర్మిల ఆందోళనలో అర్ధం ఉందని అంటున్నారు.