మళ్లీ ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశం.. రాష్ట్రం కోసం బాబు, దేశం కోసం బీజేపీ! | tdp joins nda again| babu| meet| amitshah| nadda| pawan| toda| seats
posted on Feb 8, 2024 10:59AM
పొత్తు పొడిచింది. దేశ ప్రయోజనాల కోసం అంటూ బీజేపీ, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ తెలుగుదేశం సార్వత్రిక ఎన్నికల ముందు జట్టు కట్టేందుకు దాదాపుగా ఒక అవగాహనకు వచ్చేశాయి. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడం ఖాయమైపోయింది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం (ఫిబ్రవరి 7) అర్థరాత్రి హస్తినలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో పొత్తుపై ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. ఇక ఏపీలో ప్రస్తుతం ఉన్న పురిస్థితులపై చంద్రబాబు అమిత్ షా, నడ్డాలు పూసగుచ్చినట్లు వివరించారని చెబుతున్నారు. చంద్రబాబు చెప్పిన ప్రతి విషయంతోనూ ఏకీభవించిన అమిత్ షా.. జగన్ పాలన, ఏపీలో పరిస్థితులకు సంబంధించి తన వద్ద ఉన్న నివేదికలో ఈ వివరాలన్నీ ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైన జనసేన ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే.
ఏపీలో జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యం అంటూ పవన్ కల్యాణ్ గతంలోనే తెలుగుదేశంతో కలిసే తమ పార్టీ ఎన్నికలకు వెడుతుందని ప్రకటించేశారు. అప్పటి నుంచీ తెలుగుదేశం, జనసేనలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయి. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
అయితే మొదటి నుంచీ కూడా పవన్ కల్యాణ్ బీజేపీని కూడా కలుపుకుని పోతామన్న అభిప్రాయమే వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆ విషయంలో ఏదీ తేల్చకుండా నాన్చిన బీజేపీ ఎట్టకేలకు ఏపీలో తెలుగుదేశం, జనసేనలతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఎన్డీయే బలోపేతంపై దృష్టి సారించింది. అందుకే పాత మిత్రులను కలుపుకు పోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో అమిత్ షా, నడ్డాలు భేటీ అయ్యారు.
ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కూడా గురువారం హస్తిన వెళ్లి అమిత్ షా, నడ్డాలతో భేటీ కానున్నారు. అయితే అప్పటికే చంద్రబాబు హస్తిన నుంచి హైదరాబాద్ కు వచ్చేస్తారు. ఒక రోజు వ్యవధిలో తెలుగుదేశం అధినేత, జనసేన అధినేతతో అమిత్ షా, నడ్డాలు వేరువేరుగా భేటీ అవ్వడానికి కారణమేమిటన్నదానిపై రాజకీయవర్గాలలో పలురకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే బీజేపీ కలవడంతో ఏపీలో సీట్ల సర్దు బాటు విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిన తెలుగుదేశం, జనసేనలు తమ తమ స్థానాలలో ఒకటి రెండు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అవగాహనకు రావడంతో బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సహజంగానే బీజేపీ పొత్తులో భాగంగా తమకు అసెంబ్లీ కంటే లోక్ సభ స్థానాల విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. అయితే చంద్రబాబు మాత్రం పరస్పర ఉపయోగం ఉన్న చోట్లే సీట్ల సర్దుబాటు చేసుకుందామని ఇప్పటికే బీజేపీ పెద్దలకు చెప్పేశారంటున్నారు. అలా కాకుండా బలం లేని చోట పోటీకి నిలబెడితే అది అంతిమంగా వైసీపీకి అనుకూలం అవుతుందని ఆయన వివరించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలో 2014 నాటి పొత్తులు మళ్లీ పొడిచాయనీ, అప్పటి ఫలితమే పునరావృతం అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.