posted on Feb 8, 2024 11:57AM
కోడికత్తి దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనుకు హైకోర్టు గురువారం (ఫిబ్రవరి 8) బెయిలు మంజూరు చేసింది. అయితే కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదని షరతు విధించింది. అలాగే వారంలో ఒక రోజు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐదేళ్ల కిందట అప్పటి విపక్ష నేత జగన్ పై శీను కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి కేసులో అప్పుడు అరెస్టైన శీను ఇంత కాలం బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లోనే మగ్గుతున్నారు. అప్పట్లో కోడి కత్తి కేసు దర్యాప్తు ఎన్ఐఏ టేకప్ చేయాలని డిమాండ్ చేసి సాధించుకున్న సంగతి విదితమే. ఏపీ పోలీసులపైనా, సీబీఐ పైనా నమ్మకం లేదంటూ ఆయన పట్టుబట్టి మరీ ఎన్ఐఏ చేత దర్యాప్తు జరిపించేలా ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇక అప్పటి నుంచీ ఈ కేసు దర్యాప్తు నత్తనడక నడుస్తూనే ఉంది. ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ హత్య కేసులో నిదితుడిగా ఉన్న ఒక ఎంపీకి ముందస్తు బెయిల్ లభిస్తుంది. కానీ, కోడి కత్తి కేసులో నిందితుడు, శ్రీనివాసరావు ఐదేళ్లుగా జైలులో మగ్గుతున్నా, ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా, అతనికి మాత్రం ఇప్పటి వరకూ కనీసం బెయిలు లభించలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నది ఎన్ఐఏ కనుక, ఆ దర్యాప్తు సంస్థకు ఉగ్రవాదులు, తీవ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తే ప్రధానం కనుక ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అయితే బెయిలు విషయంలో జాప్యానికి మాత్రం పూర్తిగా జగన్ దే బాధ్యత.
ఈ కేసులో బాధితుడైన జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే నిందితుడు శీనుకు వెంటనే బెయిలు లభించే అవకాశం ఉంటుందని న్యాయవాదులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా.. కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా కోర్టులు ఎన్ని సార్లు నోటీసులు జారీ చేసినా జగన్ కు మాత్రం కోర్టుకు వచ్చేందుకు సమయం చిక్కలేదు. అంతే కాకుండా ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఈ దాడి వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని విస్పష్టంగా తేల్చేసినా బాధితుడైన జగన్ మాత్రం ఎన్ఐఏ దర్యాప్తు తీరు సరిగా లేదనీ మరింత లోతైన విచారణ జరపాలనీ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాకపోవడం గమనార్హం.
తన దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఈ కేసులో నిందితుడైన జనపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు జగన్ నాడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు కోడికత్తి శీనుకు ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.