నిజమైన ప్రజా నేత చంద్రబాబు.. మరి కేసీఆర్? | real peoples leader cbn| what| about| kcr| cader| party| welfare| ignore| hide
posted on Feb 9, 2024 10:44AM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఓటములు మరెన్నో విజయాలు.. ప్రత్యర్థుల నుంచి ఎన్నో సవాళ్లు, విమర్శలు ఎదుర్కొన్నారు.. కానీ విజయాలతో పొంగిపోలేదు.. ఓటములకు కుంగిపోలేదు.. ప్రత్యర్థుల విమర్శలకు వెనకడుగు వేయలేదు. ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక్క లక్ష్యం, సంకల్పం చంద్రబాబును నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రజానేతగా నిలిపింది. చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టిన నాటినుంచి ప్రజా సంక్షేమం కోసం ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి నేతకైనా అన్నీ నమస్కారాలే ఎదురవుతాయి.. కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక రాజకీయ నేతలో అసలైన సామర్థ్యం బయటపడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం నుంచి ఎదురయ్యే రాజకీయ వ్యూహాలను ఎదుర్కోవటం మామూలు నేతలకు సాధ్యం కాదు.. ప్రజల పక్షాన పోరాటాలు చేసే నేతలకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అలాంటివారిలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారు. ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు లాంటి నేతను చూసి బీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్లు కనిపిస్తోంది.
కేసీఆర్ అంటే.. ఉద్యమ నేతగా ఎవరికైనా గుర్తుకొస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం సుదీర్ఘకాలం ఉద్యమం చేసినవారిలో కేసీఆర్ ఒకరు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. సీఎంగా బాధ్యతలు చేపట్టి పలు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేశారు. వరుసగా రెండోసారికూడా అధికారంలోకి వచ్చి 10ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ చెప్పిందే వేదంగా సాగింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్ సీఎం పదవి కోల్పోయిన తరువాత డీలా పడిపోయారు. పదేళ్లు అధికారంలో ఉండి ఒక్కసారిగా ప్రతిపక్షంలోకి వెళ్లడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోయారు. ఆయన ఓటమిని తట్టుకోలేకపోతున్నారని విస్పష్టంగా తెలిసిపోతోంది. పరాజయం తరువాత హుందాగా ఓటమిని అంగీకరించి, గెలిచిన పార్టీకి, నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపి, రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించడం కనీస మర్యాద. కానీ కేసీఆర్ ఆ కనీస మర్యాదను కూడా పాటించలేదు. రహస్యంగా ప్రగతి భవన్ ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీనీ, నూతన సీఎం రేవంత్ ను అభినందించలేదు. గవర్నర్ ను కలిసి రాజీనామా కూడా సమర్పించలేదు. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖ పంపించేసి అందరికీ ముఖం చాటేశారు. ఇక ఇప్పుడు కనీసం అసెంబ్లీ సమావేశాలకు సైతం కేసీఆర్ హాజరు కాకపోవటం ఆయన ఒక్క ఓటమితో ఎలా డీలాపడిపోయారో అవగతమౌతోందని అంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు కొనసాగారు. ఆ తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2009లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడంతో మరోసారి సీఎంగా వైఎస్ఆర్ బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు దఫాలుగా ప్రతిపక్షంలో చంద్రబాబు ఉన్నప్పటికీ ఎక్కడా కుంగిపోలేదు. పార్టీ బలోపేతం కోసం, తనను నమ్ముకున్న వారికి అండగా నిలుస్తూ ప్రజల పక్షాన అసెంబ్లీలో గళమెత్తారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఏపీలో అమరావతి రాజధానికోసం విశేష కృషి చేశారు. ఏపీకి పలు కంపెనీలను తీసుకొచ్చారు. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. వైసీపీ అధికారంలోకి రావడంతో సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొన్నిరోజులకే అమరావతి ఏపీ రాజధాని కాదంటూ బాంబు పేల్చాడు. దీనికితోడు, చంద్రబాబు కంటే జగన్ చాలా చిన్నవాడు.. చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనుభవంలో పావువంతుకూడా జగన్ కు లేదు. అలా అని.. జగన్ నాకంటే చిన్నవాడు.. నేను అసెంబ్లీకి వెళ్లి ప్రతిపక్షంలో జగన్ ముందు కూర్చోను అని అనలేదు. చంద్రబాబు లక్ష్యం ప్రజా సంక్షేమం, తనను నమ్ముకున్న క్యాడర్ ను కాపాడుకోవటం. ఇదే అసలైన ప్రజానేతకు ఉండే లక్షణం. ప్రస్తుతం కేసీఆర్ ఈ విషయంలో చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్లూ వీళ్లూ కాదు స్వయంగా బీఆర్ఎస్ క్యాడరే అంటున్నది. అధికారంలో ఉన్న సమయంలో సంతోషంగా ఎలా అయితే అసెంబ్లీకి వెళ్తామో.. అధికారం కోల్పోయిన సందర్భంలోనూ అదే ఉత్సాహంతో అసెంబ్లీకి వెళ్లి అధికార పక్షాన్ని ప్రజా సమస్యలపై నిలదీయడమే నికార్సయిన రాజకీయ నేత లక్షణం. ఆ లక్షణాలు కేసీఆర్ లో ఇసుమంతైనా కనిపించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును చూసి నేర్చుకోవాలని అంటున్నాయి.