Leading News Portal in Telugu

జగన్ కు రేవంత్ రిటర్న్ గిఫ్ట్!? | revanth return gift to jagan| ycp| mlas| ministers| assets| business


posted on Feb 9, 2024 2:03PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం  జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. గత ఎన్నికలలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జగన్ విజయం కోసం ఏం చేశారో.. దాదాపుగా అదే ఇప్పుడు రివర్స్ లో చేయడానికి రేవంత్  రెడీ అయిపోయారు.  ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోసేందుకు, వైఎస్ బిడ్డ షర్మిలకు పగ్గాలు అప్పగించిన కాంగ్రె స్ నాయకత్వం.. జగన్ ను ఓడించడమే ఏకైక లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

అందులో భాగంగా  వైసీపీ నేతల ఆస్తుల మూలాలు ఉన్న తెలంగాణపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో నాటి సీఎం చంద్రబాబునాయుడును ఓడించి, తన మిత్రుడైన జగన్‌ను గద్దెనెక్కించేందుకు కేసీఆర్ సహకరించారు.   చంద్రబాబుకు రిటన్‌ గిఫ్ట్ ఇస్తానని మీడియా సమక్షంలోనే కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు కూడా. ఆ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల భూములున్న తెలుగుదేశం నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే నేతలు, వివాదాస్పద భూములు కొన్న తెలుగుదేశం  ప్రముఖులను.. నాటి కేసీఆర్ సర్కారు భయపెట్టింది.  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అయితే అప్పట్లో  తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి మారుతూ ఇక్కడ ఆస్తులు ఉన్నాయి అందుకే పార్టీ మారక తప్పడం లేదు అని బాహాటంగానే చెప్పేశారు. దీంతో కేసీఆర్ అప్పట్లో తెలుగుదేశం వారిని ఎంతగా భయపెట్టారో అందరికీ అవగతమైంది.

అంటే వారిని లొంగదీసుకోవడానికి  వారి భూములకు రెవిన్యూ శాఖ నోటీసులు, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్న బెదరింపులు, కోర్టులో కేసులు.. ఇలాంటి చర్యలతో భయపడిన చాలామంది నేతలు, టీడీపీ నుంచి పోటీ చేసేందుకు కూడా వెనక్కు తగ్గిన పరిస్థితి నాడు నెలకొంది.   జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు,  వైసీపీలోకి దూకేయడానికి కూడా  కేసీఆర్ అనుసరించిన ఇలాంటి వ్యూహమే కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎన్నికల ముందు తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు.. ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన మహబూబ్‌నగర్- నల్లగొండలో తిష్టవేసి, వైసీపీ అభ్యర్ధులకు నిధులు పంపిణీ చేశారన్న ప్రచారం అప్పట్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అందులో వాస్తవం లేకపోలేదని పరిశీలకులు కూడా విశ్లేషించారు. ఇక తెలుగుదేశం కు హైదరాబాద్ నుంచి నయాపైసా నిధులు అందకుండా కేసీఆర్ సర్కారు  చాలా  కట్టుదిట్టం చేసింది. ఫలితంగా తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది.  

ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్‌ను బతికించేందుకు తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా  సరిగ్గా అదే వ్యూహం అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు వైసీపీకి నిధులు అందే మార్గాలను  మూసివేసే ప్రణాళిక ఇప్పటికే ఆరంభమైందని అంటున్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో వైసీపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు కాంట్రాక్టులు దక్కాయి.  కాళేశ్వరం సహా తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల కాంట్రాక్టులు సైతం జగన్ సిఫారసు మేరకు కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.    ఏపీసీసీ చీఫ్ షర్మిల ఢిల్లీకి వెళ్లి మరీ ఈ కాంట్రాక్టుల వ్యవహారంపై అప్పట్లో కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాంటి   కాంట్రాక్టర్లకు  బిల్లుల చెల్లింపు నిలిపివేయాలని రేవంత్ సర్కారు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. వీటిలో ఏపీకి చెంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కంపెనీల బిల్లులు కూడా ఉన్నాయంటున్నారు. కాగా ఏపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా   రాయలసీమకు   పలువురు ఎమ్మెల్యేలు  తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు.

అవి కాకుండా సీమకు చెందిన వైసీపీ నేతలకు హైదరాబాద్‌లో పబ్, బార్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఏపీలో కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఏపీకి చెందిన వైసీపీ వారిపై    కేసులు,  ఫిర్యాదులు? అలాగే  గ్రేటర్ పరిధిలోని సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలో ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్న ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి-మెదక్ జిల్లాల రిజిస్ట్రార్ల నుంచి, భూములు, భవనాలు, ఆస్తుల కొనుగోలుపై పూర్తి సమాచారాన్ని రేవంత్ సర్కార్ సేకరిస్తున్నట్లు సమాచారం.    సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిథిలోనే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలపై ఎక్కువ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని.. వైసీపీ ఎంపి,   విజయసాయిరెడ్డి జోస్యంపై, రేవంత్ సర్కారు అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై కాంగ్రెస్ నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. కనీసం మర్యాదపూర్వకంగా కూడా ఏపీ సీఎం జగన్  ఆయనను కలవకపోవడం, కనీసం అభినందనలు తెలియజేయకపోవడం ఇప్పటికే చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.  ఇప్పుడు  ఈ అన్నిటికీ సరైన రిటార్డ్ ఇవ్వడానికి రేవంత్ రెడీ అయిపోయారనీ, జన్మలో మరచిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారనీ అంటున్నారు. మొత్తం మీద జగన్ కు తాను నాడు చేసినదే ఇప్పుడు రివర్స్ లో లభిస్తోందన్న ప్రచారం సామాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది.