Leading News Portal in Telugu

లోకేశ్ ఎన్నికల ప్రచార శంఖారావం! | lokesh election campaign sankharavam| febraury| 11th| 50| days| yuvagalam| not| cover


posted on Feb 9, 2024 10:08AM

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఫిబ్రవరి 11వ తేదీన శంఖారావం పేరిట ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. శంఖారావంపై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు విడుదల చేశారు. సుమారు 50 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగనుందని.. రోజుకు మూడు నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఫిబ్రవరి 11వ తేదీన తొలి రోజు.. తొలి సభ ఇచ్చాపురంలో నిర్వహించనున్నారు. జగన్ పాలనలో మోసపోయిన వారికి భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో శంఖారావం ఎన్నికల ప్రచారం జరిగేలా ప్రణాళికలు రూపొందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

2023, జనవరి 27వ తేదీన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచి యువగళం పేరిట పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలో రాయలసీమలోని జిల్లాల మీదుగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ద్వారా నారా లోకేశ్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది.  ఆయన పాదయాత్ర రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతోండగా.. సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును ఏపీ స్కీల్ డెవలప్‌మెంట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి.. విజయవాడ కోర్టులో హాజరుపరచగా.. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించడంతో.. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

దీంతో నారా లోకేశ్… తన పాదయాత్రను తాత్కాలికం నిలిపివేశారు. అనంతరం చంద్రబాబు బెయిల్ కోసం.. ఢిల్లీ వేదికగా లోకేశ్.. న్యాయమూర్తులతో వరుస సంప్రదింపులు జరిపారు.   52 రోజు తర్వాత.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు అనారోగ్యంతో ఉన్న చంద్రబాబును కంటికి రెప్పల చూసుకుంటూ, ఆయన కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న సమయంలోనూ ఆయన వెంటే ఉన్న లోకేశ్. ఆ తర్వాత నవంబర్ చివరి వారంలో  యువగళం పాదయాత్రను పున: ప్రారంభించి.. విశాఖపట్నంలో ముగించారు.  

ఇక అసలు అయితే నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర సాగాల్సి ఉండగా.. అనుకోని పరిణామాలు చోటు చేసుకోవడంతో.. నారా లోకేశ్ తన పాదయాత్రను అనుకున్న సమయాని కంటే ముందే ముగింపు పలికి.. మళ్లీ శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమౌతున్నారు.  ఈ శంఖారావం యాత్ర 50 రోజుల పాటు సాగనుందని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే..  నారా లోకేశ్ ఈ యాత్ర పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి.