Leading News Portal in Telugu

నేడే తెలంగాణ బడ్జెట్.. కేటాయింపుల కంటే కేసీఆర్ హాజరుపైనే అందరి ఆసక్తి! | telangana budget today| will| kcr| attend| allocations| six| garuntees


posted on Feb 10, 2024 8:56AM

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శనివారం (ఫిబ్రవరి 10) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం బడ్జెట్ ను ఆమోదించింది.   ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీతో పాటు ఇతర హామీలకు నిధుల కేటాయింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.   వాస్తవికమైన బడ్జెట్‌ను, ఆచరణాత్మకమైన తీరులోబడ్జెట్ ఉంటుందని ఇఫ్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అందరి దృష్టీ బడ్జెట్ పైనే ఉంది.

అంతకంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనైనా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత కేసీఆర్ సభకు హాజరౌతారా లేదా అన్న దానిపై ఉంది. కేఃసీఆర్ సభకు హాజరౌతారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఆయన హాజరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజున కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత ప్రజా స్వామ్య ప్రాధాన్యాన్ని గుర్తించి హుందాగా వ్యవహరించాలనీ, సభకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన సభకు హాజరౌతారంటూ బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ఒక వేళ కేసీఆర్ సభకు హాజరైనా బడ్జెట్ పై చర్చలో పాల్గొంటారా? లేదా అన్న విషయంపై కూడా రాజకీయవర్గాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   

వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ సర్కర్ విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించిన కూటాయింపులు ఎలా ఉండనున్నాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.   గతేడాది రూ. 2.90 లక్షల కోట్లతో బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సారి బడ్జెట్ లో  విద్య, వైద్య, సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే  సీఎం రేవంత్ పేర్కొన్నారు. దీంతో ఆయా రంగాలకు కేటాయింపులపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక 420 హామీలు అంటూ ప్రతిపక్షం విమర్శలకు గట్టి బదులిచ్చేలా మేనిఫెస్టోలోని హామీలకు ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న ఉత్కంఠ కూడా వ్యక్తం అవుతోంది.