రైతు బంధు లొసుగుల్ని బయటపెట్టిన సీఎం రేవంత్! | revanth explores raithubandhu lapses| cm| former| kcr| wealthy| farmers| lands
posted on Feb 12, 2024 7:52AM
బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అమలు చేసిన రైతు బంధు పథకం పేద రైతులకు కాకుండా సంపన్న రైతులకు మేలు చేసింది. కేవలం ది శాతం ఉన్న సంపన్న రైతులకు రైతు బంధు నిధులలో 55శాతం అందాయని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దీనిని బట్టే ఏ రైతుల కోసం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేశారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. బీడు భూములకు, ఫామ్ హౌస్‌లకు, కొండలూ, గుట్టలకూ రైతు బంధు నిధులను విడుదల చేశారు. ప్రాజెక్టు కాలువలకు, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు కూడా రైతు బంధు అమలైంది. సాగు పెట్టుబడి పేరిట సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా నిధులను అందాయంటే కేసీఆర్ హయాంలో సంక్షేమం ఎవరికి అందిందో అవగతమౌతోంది.
బడా వ్యాపారులు, సంపన్నులు వ్యాపారాల్లోనూ, ఇతరేతర రంగాల్లోనూ పెట్టుబడులను పెట్టడం మానుకుని భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించారు. దానివల్ల స్థిరాస్తికి స్థిరాస్తి ఉండిపోతుంది, అదనంగా రైతు బంధు డబ్బులుఅందుతాయి. దీంతో పల్లెల్లో పెద్ద యెత్తున భూముల క్రయవిక్రయాలు జరిగాయి. దీని వల్ల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులకు భూమి లేని పరిస్థితి ఎదురైంది. ఇది ఆర్థిక అసమానతలను పెంచేందుకు దోహదపడింది.అతి కొద్ది మంది సంపన్నుల చేతిలోకి వందలాది ఎకరాల భూములు వెళ్లిపోయాయి. ఫామ్ హౌస్ లు భూసంస్కరణల చట్టం పరిధిలోకి రాకుండా ఉన్న మినహాయిపును ఆధారం చేసుకుని అతి కొద్ది మంది సంపన్నులు భూములను గంపగుత్తగా అధీనంలోకి తెచ్చుకోగలిగారు. అటువంటి ఫామ్ హౌస్ భూములకు కూడా రైతు బంధు నిధులు అందాయంటే.. ఆ పథకం ఉద్దేశమేమిటి? లక్ష్యమేమిటన్నది ఇట్టే అర్దమౌతుంది.
ఇక విషయంలోకి వస్తే రైతు బంధు పథకం కింద లబ్ధి పొందిన వారిలో ఎకరం లోపు భూమి ఉన్నవారు 22.55లక్షల మంది. అలాగే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది. వీరికందరికీ కలిపి అందే రైతు బంధు నిధులు 45శాతం మాత్రమే. ఇలా రైతు బంధు అందుకుంటున్న వారు దాదాపు 90 శాతం మంది. ఇక మిగిలిన పది శాతం మంది సంపన్న రైతులకు దాదాపు 55 శాతం రైతు బంధు నిదులు అందాయి. దీనిని బట్టే సాగులో లేని భూములకు, అసలు రైతులే కాని వారికి కేవలం భూ యజమానులన్న కారణంతో అప్పనంగా డబ్బులను పందేరం చేయడమే రైతు బంధు సాధించిన ప్రయోజనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వివరాలన్నీ ధరణి పోర్టల్ లో ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే రేవంత్ సర్కార్ సాగులో లేని భూములకు రైతు బంధు (రైతు భరోసా) ఉండదని స్పష్టం చేసింది. సెలబ్రిటీలను, బడా రైతులను, తదితరులను మినహాయించి చిన్న, సన్నకారు రైతులకు, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలన్న రేవంత్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది.