posted on Feb 12, 2024 12:07PM
మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పాలనలో పోటీ పరీక్షలు నిర్వహించకపోవడంతో నిరుద్యోగ సమస్య అంతకంతకూ పెరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో లో ప్రకటించిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. వయసు మీరిన నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కారు నడుం బిగించింది. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూనే నిరుద్యోగులు ఏజ్ బార్ అయిపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు వయోపరిమితిని పెంచుతామని ప్రకటించారు. ఈమేరకు సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జీవో విడుదల చేశారు. గ్రూప్ 1 సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచారు.