రాజ్యసభకు సోనియా?..ఖమ్మం బరిలో నిలిచేదెవరో? | sonia prefer rajyasabha| khammam| loksabha| contest| congress| candidate| priyanka
posted on Feb 13, 2024 5:31AM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత తొలి సారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు నుంచి ప్రజాసం క్షేమమే ధ్యేయంగా రేవంత్ పాలనపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రేవంత్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. బడ్జెట్ లోనూ ఆరు గ్యారెంటీల అమలుకు పెద్ద పీట వేసింది. సముచిత కేటాయింపులు జరిపింది. గత ప్రభుత్వం తరహాలో కాకుండా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందించడంపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. ఫలితంగా సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ విజయాన్ని కాంక్షించినవారు సైతం ప్రస్తుతం కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. దీంతో మరో రెండు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మరో రెండు నెలల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో 12 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించడంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. దీనికి తోడు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ పెరగడంతో గెలుపు తేలిక అవుతుందని బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నవారు భావిస్తున్నారు. ఇప్పటికే, పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ అధికంగా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. వీరిలో ఖమ్మం నియోజకవర్గం నుంచి తుమ్మల, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క ఉన్నారు. వీరు ముగ్గురు ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారు. భట్టి డిప్యూటీ సీఎంగా ఉండగా, తుమ్మల, పొంగులేటి మంత్రులుగా ఉన్నారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు పొంగులేటి శ్రీనివాస్ సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, రేణుకా చౌదరి, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, వి. హనుమంతరావులు ఉన్నారు. వీరంతా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సోనియాగాంధీ ఈ దఫా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఒకవేళ సోనియా కాకుంటే ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దీనికితోడు సోనియా ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీచేయాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఆమె కూడా అందుకు అంగీకరించారనీ, ఖమ్మం నుంచి సోనియానే పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అయితే ఇప్పుడు సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయడం లేదని తేలిపోయింది. వృద్దాప్యం, అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని సోనియా నిర్ణయించుకున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు.
సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడం ఖరారు కావడంతో ప్రియాంక గాంధీ ఖమ్మం నుంచి లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతారని భావించారు. కానీ, ప్రియాంక గాంధీ సోనియా నియోజకవర్గం అయిన రాయ్ బరేలి నుంచి పోటీ చేయనున్నారు. సోనియా, ప్రియాంక ఇద్దరూ ఖమ్మం నుంచి పోటీ చేయడం లేదని తేలిపోవడంతో ఖమ్మం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న అంశం ఆసక్తికరంగా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో రేణుకా చౌదరి పోటీ చేశారు. బీఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. మరోసారి రేణుకా చౌదరి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి సతీమణి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు , వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లు కూడా ఖమ్మం రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఈదఫా ఎన్నికల్లో ఎవరు బరిలో నిలిచినా కాంగ్రెస్ విజయం ఖాయమన్నవాదన రాజకీయ వర్గాల్లో ఉంది.