సరి కొత్త జగన్నాటకం.. ప్రజల చేతిలో పరాభవం ఖాయం | jagan start new drama| hyderabad| combined| capital| people| alert| differ| oppose| ycp
posted on Feb 14, 2024 7:47AM
అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా ఉంది ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు. ఉన్నవాటిని కూల్చేసి.. కొత్తగా అభివృద్ధి ఏంటో మేం చూపిస్తామంటూ గొప్పలు చెప్పుకుని ప్రజలను నమ్మించి ఒక్క చాన్స్ కొట్టేసిన జగన్ నాలుగున్నరేళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగించారు. ఇప్పుడు తీరా ఎన్నికల సమయం వచ్చేసే సరికి మేము ప్రయత్నం చేశాం.. మావల్ల కాలేదంటూ చేతులెత్తేశారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఒక రాజధానికి శంకుస్థాపన చేస్తే.. మేము మూడు రాజధానులు కడతాం.. మూడు ప్రాంతాల్లో అద్భుత పాలన సాగిస్తాం అంటూ డప్పాలు కొట్టుకుని.. చివరికి కనీసం ఒక్క రాజధాని కదుకదా.. ఎక్కడా ఒక్క ఇటుక పెట్టి నిర్మాణాలు చేసిన దాఖలాలు జగన్ పాలనలో ఎక్కడా కనిపించవు. మామూలుగా కాదు.. భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. నాలుగున్నరేళ్లు మూడు రాజధానులంటూ ఉత్తుత్తి కబుర్లు చెప్పిన జగన్ , ఇప్పుడు మన దగ్గర రాజధానిని నిర్మించుకునేంత స్థోమత లేదు.. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేద్దాం అంటూ తన చేతగానితనాన్ని బయట పెట్టుకున్నారు.
ఏపీలో నాలుగున్నారేళ్ల జగన్ పాలనలో ప్రజలు విసిగివేసారి పోతున్నారు. కనీసం ఉపాధి, ఉద్యోగాలులేక హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వలస పోతున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ హయాంలో చెప్పుకోదగ్గ ఏ ఒక్క కంపెనీకూడా ఏపీలో అడుగుపెట్టలేదు. గత చంద్రబాబు పాలనలో ఏపీలో బడా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో కొన్నింటిని ఏపీ నుంచి తరిమేశారు. ఉన్న రాజధాని అమరావతిని చిదిమేసి.. మూడు రాజధానుల పేరుతో జగన్ నేల విడిచి సాము చేశారు. పాలనా అనుభవంలేని జగన్ , మూడు రాజధానుల హామీని నెరవేర్చలేక , అది ప్రాక్టికల్ గా అసాధ్యం అని తెలిశాకా, విశాఖ పల్లవి ఎత్తుకున్నారు. విశాఖ పట్టణం పరిపాలన రాజధానిగా చేస్తున్నాం.. ఇదిగో రేపటి నుంచి.. అదిగో ఎల్లుండి నుంచి విశాఖ నుంచి పాలన మొదలవుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో జగన్ కొత్తనాటకానికి తెరలేపారు. తనచేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కోర్టుల్లో చిక్కులుకారణంగా విశాఖకు వెళ్లలేక పోతున్నాం అంటూ జగన్ బాబాయి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేత మీడియా ముందు ఒక ప్రకటన చేయించారు.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత.. ఏపీకి రాజధాని ఉండాలని భావించారు. పలు వర్గాలు, పార్టీల ప్రతినిధులను సంప్రదించి అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో అమరావతి పరిసర ప్రాంతాల్లోని రైతులు సైతం స్వచ్చందంగా ముందుకొచ్చి తమ భూములను అప్పగించారు. రాజధానిలో హైకోర్టుతోపాటు తాత్కాలికంగా పాలన సాగించేందుకు భవనాలను నిర్మించారు. చంద్రబాబు పాలన సైతం అమరావతి నుంచే సాగింది. భారతదేశంలోనేకాక ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో చంద్రబాబు ముందుకు సాగారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. జగన్ సీఎం కుర్చీ ఎక్కిన నాటి నుంచి నిర్మాణాలను మరిచి.. కూల్చివేత పర్వానికి, విధ్వంసానికి తెర లేపారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందన్న దుగ్ధతో, భయంతో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారని తెలిసినా, ప్రభుత్వ సొమ్ము వృథా అవుతుందని తెలిసినా.. అమరావతి రాజధాని కాదు.. మేము మూడు రాజధానులు చేస్తాం అంటూ జగన్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకొని అక్కడినుంచే పాలన సాగించేలా జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ, రాజధాని ఏర్పాటు అంటే అంత తేలికైన విషయం కాదుకదా.. అనుభవం లేని జగన్ కు అవేమీ తెలియక మొండి వైఖరితో ఏపీ ప్రజల జీవితాలో ఆటలాడుకుంటూ వచ్చాడు. ఇదిగో రేపు.. అదిగో ఎల్లుండి నుంచే విశాఖ నుంచి పాలన సాగిస్తామని చెప్పుకుంటూ వచ్చిన జగన్.. అది సాధ్యంకాకపోయే సరికి ప్రజలను మరోమాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కోర్టులో చిక్కుల కారణంగా విశాఖ నుంచి పాలన సాగించలేక పోతున్నామని చెప్పాడు. అంతేకాదు.. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందేనని.. ఆ గడువును మరికొన్నేళ్లు పెంచమని పోరాటం చేద్దామని చెప్పుకొచ్చాడు. ఉన్న రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం చేతకాని జగన్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్తపాత పాడుతుండటం ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత రావడంతో.. మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేమని భావించిన జగన్.. ప్రజలను తమవైపుకు తిప్పుకొనేలా హైదరాబాద్ అంటూ ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఎన్నికల్లో గట్టెక్కేందుకు కొత్త నాటకానికి తెరలేపాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే ఈ సారి జనం జగన్మాయలో పడరని కూడా చెబుతున్నారు.