Leading News Portal in Telugu

మ‌హిళా పారిశ్రామిక వేత్తతో మంత్రి విడదల ర‌జినీకి టీడీపీ చెక్! | check to vidadala rajani| women| industrialist| guntur| west


posted on Feb 14, 2024 12:04PM

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.  కమ్మ సామాజికవర్గానికి తప్పతెలుగుదేశం అభ్యర్థిగా  ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలుస్తూంటారు. కాంబినేషన్ కుదిరితే చాలు. కాంగ్రెస్, వైసీపీ పదే పదే అభ్యర్థుల్ని మార్చి మార్చి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది.  వైసీపీ  చిలుకలూరిపేట నుంచి విడదల రజనీని ఇక్క‌డికి దిగుమతి చేశారు. అక్కడ ప్యాకప్ చేసుకుని గుంటూరులో రెడీ అయిపోయిన రజనీ.. గల్లీ గల్లీ చుట్టేస్తున్నారు. అయితే  ఆమెకు ఇప్పుడిప్పుడే  పరిస్థితులు అర్థమవుతున్నాయని అంటున్నారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున చంద్రగిరి ఏసురత్నం నిలబడితే.. తెలుగుదేశం నుంచి మద్దాలి గిరి పోటీ చేశారు. గెలిచిన గిరి తనకు ఉన్న జిన్నింగ్ మిల్లులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం పార్టీ మారిపోయారు. ఇప్పుడు ఆయనకు  జగన్ టిక్కెట్  ఇవ్వలేదు.  గుంటూరు వెస్ట్ తెలుగుదేశం కంచుకోట కాబట్టి.. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఎక్కువ ఉంటుందని అనుకుంటారు. కానీ గుంటూరు వెస్ట్ లో అన్ని సామాజికవర్గాల జనాభా ఉంటుంది. ఎవరూ లీడ్ కాదు. గెలుపోటములను శాసించే పొజిషన్ లో  ఏ  సామాజిక వర్గమూ లేదు.  అక్కడ ఉన్న సామాజికవర్గాల ప్రకారం చూసినా.. . ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి ప్రకారం చూసినా… విడదల రజనీ గెలుపు కష్టమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గుంటూరు పశ్చిమలో కమ్మ, కాపు, బీసీ ఓట్ల బలం ఉంటుంది. బీసీల్లో వడ్డెర వర్గానికి బలం ఉంటుంది. విడదల రజనీ ముదిరాజ్ వర్గానికి చెందిన వారు. ఆమె భర్త రజక వర్గానికి చెందిన వారు. ఈ వర్గాల ప్రభావం పశ్చిమలో అంతంతమాత్రం. పైగా గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీకి  కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ పాతిక వేల ఓట్ల వరకూ చీల్చినప్పటికీ.. తెలుగుదేశం అభ్యర్థి  ఐదు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.  ఈ సారి తెలుగుదేశం, జనసేన పొత్తుతో పోటి చేస్తున్నాయి కనుక పలితం ఏకపక్షంగా ఉంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

 విజయంపై ధీమాతో ఉన్న  తెలుగుదేశం కూట‌మి రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ముమ్మరం చేసింది. తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారు కావడంతో,  ఇరు  పార్టీల అధినేతలు ఇప్పటికే పలు దఫాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. అటు బీజేపీతో కూడా పొత్తు చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు కొత్త నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాజధాని ప్రాంతమైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై తెలుగుదుశం  అధినేత చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీకి మద్దతివ్వడంతో… ఆ నియోజకవర్గంలో హ్యాట్రిక్ గెలుపు దిశగా… తెలుగుదేశం పావులు కదుపుతోంది. 

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జుగా ఇప్పటికే మంత్రి విడదల రజినీ కొనసాగుతున్నారు. దీంతో ఆమెకు దీటుగా మహిళా అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపాలని తెలుగుదేశం భావిస్తున్నది. రాజకీయాలకు ఏ మాత్రం పరిచయం లేని ఓ మహిళా పారిశ్రామిక వేత్తను  తెలుగుదేశం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త వీఆర్ శ్రీ లక్ష్మీ శ్యామలను ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీలో దింపాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. వ్యాపార రంగంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల… కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డెయిరీ వ్యాపారం ద్వారా పాడి రైతులకు అండగా నిలిచారు. అదే సమయంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలో  పలు సేవా కార్యక్రమాలను శ్రీ లక్ష్మీ శ్యామల నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక భావాలతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పలు ఆలయాలను పునర్నించారు కూడా. ఆధ్యాత్మిక రంగంలో సైతం శ్రీ లక్ష్మీ శ్యామల విశేష కృషి చేశారు. డెయిరీ వ్యాపారంలో రాణిస్తున్న శ్రీ లక్ష్మి శ్యామల… వివిధ వ్యాపారాల్లో సైతం పెట్టుబడులు పెట్టి సక్సెస్ అయ్యారు. 

గతేడాది నవంబర్ చంద్రబాబు పెరంబదూర్ పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనతో పాటే శ్రీ లక్ష్మి శ్యామల సైతం రామానుజుల వారిని దర్శించుకున్నారు. సౌమ్యురాలిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ లక్ష్మి శ్యామలతో ఇప్పటికే పలు దఫాలు పార్టీ కీలక నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి విడుదల రజినికి చెక్ పెట్టేందుకు వచ్చే ఎన్నికలలో   టీడీపీ తరఫున శ్రీ లక్ష్మీ శ్యామలను అభ్యర్థిగా నిలబెడితే.. గత ఎన్నికల్లో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తున్నది.