జగన్ తప్పుమీద తప్పు.. బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు జీవో! | jagan go to deceive banks| amarawati| mlas| mlcs| officers| employees| rent
posted on Feb 15, 2024 10:18AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తప్పుమీద తప్పు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల వ్యవధిలోనే పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను తొలగించిన జగన్ ప్రభుత్వం.. ఏపీ ప్రజలు గొప్పగా చెప్పుకోవాల్సిన అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది.. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ఇన్నాళ్లు సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి కాలం వెళ్లదీశారు. నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ చేసింది కేవలం కక్ష రాజకీయాలేనన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం.. పోలీసులతో కొట్టించడం.. ఆ తరువాత జైలుకు పంపించడం. ఇదే జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల పాలన అంటూ ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి కొత్త రాజధానిని నిర్మించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సంకల్పించారు. దేశంలో, విదేశాల్లో తిరిగి పేరున్న కంపెనీలను ఏపీకి తీసుకొచ్చారు. రాజధాని అమరావతిలో భవనాల నిర్మాణం చేపట్టారు. వాటిని సద్వినియోగం చేసుకొనే దశలో ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి అధికార బాధ్యతలు అప్పగించారు. జగన్ హయాంలో ఏ ప్రాంతంలో నూ కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. ఇది జగన్ రాజకీయ ప్రత్యర్థుల మాట మాత్రమే కాదు. జనం అభిప్రాయం కూడా. ప్రస్తుతం.. మరో ఎన్నికల సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో జగన్ కొత్త నాటకానికి తెరలేపారు. రాజధానిగా అమరావతిని నిర్వీర్యం చేశారన్న అపవాదను ఎదుర్కొంటున్న జగన్.. అదే సమయంలో తాను చెప్పిన మూడు రాజధానుల హామీ కూడా కార్యరూపం దాల్చకపోవటంతో ఏపీ ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికుతోంది. ఈ క్రమంలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేద్దామనుకున్నా.. కోర్టు చిక్కుల వల్ల అది సాధ్యం కావడం లేదు.. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని చూస్తే కొత్త రాజధానిని నిర్మించుకోలేము.. హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా గడువు పెంచాలని కేంద్రంపై పోరాటం చేద్దామని ఆ పార్టీ నేత, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి చెప్పాడు. తద్వారా ఏపీ ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్యం పై వ్యతిరేకతను పోగొట్టుకోవాలని జగన్ అనుకున్నారు. కానీ, సుబ్బారెడ్డి వ్యాఖ్యల పై విమర్శలు వెల్లువెత్తడం తో జగన్ అప్రమతం అయ్యాడు.
దీంతో మంత్రి బొత్స రంగంలోకి దిగి.. పదేళ్ల తరువాత హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ఎలా అడుగుతామని ప్రశ్నించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఉమ్మడి రాజధాని వైసీపీ ప్రభుత్వం విధానం కానేకాదంటూ బొత్స చెప్పుకొచ్చాడు. తాజాగా.. మరో విషయంలో జగన్ ప్రభుత్వం తప్పుచేసిందన్న వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. ఈసారి ఏకంగా బ్యాంకులను బురిడీ కొట్టించే ప్రయత్నం జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.
అమరావతి రాజధానిని చంపేయాలన్న కోరికను బలంగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం.. ఆ కార్యక్రమాన్ని నాలుగున్నరేళ్లుగా దిగ్విజయంగా చేస్తూ వచ్చింది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో 75శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్‌లు, సెక్రటేరియట్ ఉద్యోగులకోసం నిర్మించిన భవనాలనుకూడా జగన్ ప్రభుత్వం పూర్తిచేయలేదు. దీంతో అక్కడ పిచ్చిమొక్కలు పెరిగిపోయి, పాడుపడ్డ భవనాలుగా మారిపోయాయి. అయితే, ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం.. అమరావతి క్వార్టర్స్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు నివాసముంటున్నారట.. సీఆర్డీఏకి 70కోట్లు అద్దెలుకూడా కడుతున్నామని జీవో లో ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాడుపడ్డ భవనాలకు అద్దెలు చెల్లించటమేంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంతకీ ప్రభుత్వం ఈ జీవో ఎందుకు ఇచ్చిందంటే.. సీఆర్డీఏకి గతంలో బ్యాంకులు అప్పు ఇచ్చాయి. 500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 2వేల కోట్లు బ్యాంకు వాటా కింద అప్పు ఇచ్చాయి. అప్పటి ప్రభుత్వ ఒప్పందం ప్రకారం.. 2023 కల్లా భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలన్న కండీషన్ ఉంది. 2023 నాటికి భవనాలు పూర్తికాకపోతే పూర్తి అప్పును ప్రభుత్వం చెల్లించాలి. దీంతో ప్రభుత్వం ఆ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు బ్యాంకులను బురిడీ కొట్టించేలా జీవో విడుదల చేసిందంటున్నారు. అయితే.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఉద్యోగులు ఆ భవనాల్లో నివిసిస్తున్నప్పుడు నెలనెలా వారికి 40వేల కోట్ల రూపాయల అలెవెన్సులు చెల్లించటం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి ప్రజాప్రతినిధుల నుంచి ఆ సొమ్మును రికవరీ చేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.