Leading News Portal in Telugu

గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ!? | brs empty in greater hyderabad| ghms| corporators| big| number| jump| congress| former| mayor


posted on Feb 15, 2024 10:06AM

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా అధికారం కోల్పోయినా గ్రేటర్ లో మాత్రం సత్తా చాటింది. గ్రేటర్ లో ఆ పార్టీ గెలిచిన స్థానాల కారణంగానే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కింది. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని   గ్రామీణులకు అర్ధమయ్యేలా చెప్పడంలో విఫలమయ్యామనీ, తాము ప్రచారం కంటే పని తీరుకే ప్రాధాన్యత ఇచ్చామనీ బీఆర్ఎస్ చెప్పుకుని, ఇక తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై క్షేత్ర స్థాయిలో ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేలా ముందుకు సాగుతామని చెప్పుకుంది. 

అయితే ఇప్పడు బీఆర్ఎస్ పరువును కాపాడిన గ్రేటర్ లోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోతున్న సూచనలు బలంగా కనిపిస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు కాంగ్రెస్ బాట పడుతున్నారు. 

ముందుగా బీఆర్ఎస్ లో కొనసాగే విషయంలో కార్పొరేటర్లు పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. 

ఒక్కరొక్కరుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పై తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. తాము కలుద్దామన్నా కనీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వడానికి కూడా కేటీఆర్ కు సమయం దొరకడంలేదంటూ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ దశలో మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు రంగంలోకి దిగి కార్పొరేటర్లతో వరుస భేటీలు అవతూ వారిని కాంగ్రెస్ టూటికి చేరేలా ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే మాజీ మేయర్, బీఆర్ఎస్ అధినేతకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన బొంతు రామ్మోహన్  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగానే కలిశాననీ బొంతు చెప్పినా.. ఆయన కారు దిగిపోవడానికే రెడీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి ఎన్నికలలో ఉప్పల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించిన బొంతు రామ్మోహన్, కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు. అసంతృప్తికి లోనయ్యారు.  దీంతో ఆయన బీఆరెస్‌ కు గుడ్ బైచెప్పడానికి నిర్ణయించుకున్నారని అంటున్నారు.  

మాజీ డిప్యూటీ మేయ‌ర్‌ బాబా ఫ‌సియుద్దీన్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.   డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌తా రెడ్డి  కూడా రేవంత్ ను కలిశారు. ఇలా రేవంత్ ను కలిసి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే వీరంతా బీఆరెస్ నుంచి  కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సుముఖంగా ఉందంటున్నారు. లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ను బలహీనపరిచి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్   బీఆరెస్ కార్పొరేట‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోందని చెబుతున్నారు. కేటీఆర్ పై అసంతృప్తితో ఉన్న‌వారంద‌రితో  కాంగ్రెస్ ఇప్పటికే టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. ఎందుకంటే గ్రేటర్ పరిధిలో మరీ ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో  కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు.  ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఎన్నికల సమయానికి బలం పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ  జీహెచ్ఎంసి కౌన్సిల్‌లో బీఆరెస్‌ను ఖాళీ చేసి పై చేయి సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్లారు. ఒక్కసారి కాంగ్రెస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే బీఆర్ఎస్ నుంచి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు. ముందుగా జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.