జగన్ కు పవన్ ఫోబియా!? | jagan suffering with pawan fobia| janasena| leader| district| tours| helicopter| landing| permission
posted on Feb 15, 2024 8:44AM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ అంటే అంటే భయం పట్టుకుందా? ఆయన జనంలోకి రాకుండా చేయడానికి కంకణం కట్టుకున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ సానుభూతితో ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చిన జగన్.. ఈ దఫా ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భావనకు వచ్చేసినట్లు ఆయన తీరు గమనిస్తే అర్ధమౌతోందని పరిశీలకులు సోదాహరణంగా వివరిస్తున్నారు. తన నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టకపోవటంతోపాటు.. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించడంలో కూడా జగన్ విఫలమయ్యారు.
దీంతో జగన్ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీ మరింత నష్ట పోతుంది, మరింత వెనుకబడిపోతుందన్న భావనకు వచ్చేసిన ప్రజలు.. జగన్, ఆయన టీంకు గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. జగన్ తాజాగా జరిపిన సర్వేల్లోనూ ఇదే రుజువైందని ఆయన పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు జగన్ తన తప్పును ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం అభిప్రాయ పడుతున్నారు.
మరో రెండు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగూ ఓటమి ఖాయమని భావిస్తున్న జగన్.. పవన్ కల్యాణ్ గెలుపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. . ఇప్పటికే పవన్ కల్యాణ్ జిల్లాల టూర్ లకు వెళ్లినప్పుడల్లా అడ్డంకులు సృష్టిస్తున్న జగన్.. తాజాగా ఆయన భీమరం పర్యటన విషయంలో నూ అవరోధాలు సృష్టించారు. ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. పవన్ నాలుగు రోజులు గోదావరి జిల్లాల్లో పర్యటించేందుకు తొలుత ప్లాన్ చేసుకున్నారు. ఆ తరువాత వివిధ జిల్లాల్లో నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయం కావడంతో తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చలు జరిపేందుకు, జనసేన నాయకులకు అందుబాటులో ఉండేందుకు ప్రతి రోజూ జిల్లాల పర్యటనలు ముగించుకొని సాయంత్రానికి అమరావతికి చేరుకొనేలా పవన్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో హెలికాప్టర్ ద్వారా పవన్ జిల్లా పర్యటనలకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అయితే సాయంత్రం వరకు జిల్లాల్లో సభలు, సమావేశాల్లో పాల్గొని రాత్రికి అమరావతి వచ్చే అవకాశం ఉంటుందని పవన్ భావించారు. ఈ క్రమంలో బుధవారం పవన్ భీమవరం వెళ్లాల్సి ఉంది. అక్కడ విష్ణు ఇంజనీరింగ్ కళాశాల హెలిప్యాడ్ లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ జగన్ ప్రభుత్వం అక్కడ హెలిప్యాడ్‌లో దిగేందుకు అనుమతి నిరాకరించింది.
దీంతో జగన్ తీరుపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొనకుండా జగన్ అడ్డుకుంటున్నారని, పవన్ అంటే జగన్ కు ఎందుకంత భయం అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యర్థులను చూసి భయంతో వణికే వ్యక్తి నాయకుడెలా అవుతారని సెటైర్లు వేస్తున్నారు. సొంత పార్టీలోనే విశ్వసనీయత కోల్పోయిన జగన్ ను జనం ఎందుకు నమ్ముతారని అంటున్నారు.