posted on Feb 16, 2024 2:07PM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత బిఆర్ఎస్ నుంచి రాజీనామాలు చేసే వారి సంఖ్య ఎక్కువైంది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వికారాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. . ఈ మేరకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హృదయభారంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కేసీఆర్‌కు పంపించిన లేఖలో పేర్కొన్నారు. తన పదవీకాలంలో సహకరించిన పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. కాగా, తన భర్త, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.నిన్న పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి దంపతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మర్యాదపూర్వకంగా కలిశారు. 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై తాండూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత జిల్లాలో మహేందర్‌రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో పట్నం దంపతులు చేరతారని కథనాలు వచ్చినా.. చివరి మూడు నెలల టైంలో మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. వికారాబాద్‌జిల్లాలోని 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.