బీఆర్ఎస్ కు కేటీఆర్ బరువేనా?.. పార్టీ నేతల్లో అంతర్మథనం! | is ktr a burden ti brs| harish| raise| ocation|working president| silence
posted on Feb 16, 2024 1:52PM
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కనీసమైన ధిక్కారం కూడా వినిపించేది కాదు. అలా వినిపించడానికి ప్రయత్నించిన ఈటల వంటి వారిని ఏ రీతిలో బయటకు పంపించేశారో అందరికీ తెలిసిందే. ప్రజాబలం ఉన్న నాయకుడైనా సరే పార్టీ అధినేత మససెరిగి ప్రవర్తించాల్సిందే. అలా కాదని తన సొంత అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి ప్రయత్నం చేసినా, కాదు కాదు ప్రయత్నిస్తున్నట్లు కనిపించినా ఇక ఆ నేతకు బీఆర్ఎస్ తో సంబంధానికి నూకలు చెల్లినట్లే. తెలంగాణ ఆవిర్భావం నుంచీ ఏకధాటిగా తొమ్మిదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ లో అంతా ఏకస్వామ్యమే. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమన్నది నేతి బీరకాయలో నేతి చందమే. అయితే తొమ్మిదిన్నరేళ్ల అధికారానికి తెరపడి బీఆర్ఎస్ విపక్షంలోకి రాగానే పార్టీలో సొంత గొంతుకలు లేస్తున్నాయి. అధినేత మాటే వేదం అన్న పరిస్థితిని ఇంకానా ఇక సాగనీయం అని కొందరు నేతలు కుండబద్దలు కొట్టేస్తున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో మెజారిటీ ఏమనుకుంటున్నారు అన్న విషయంతో సంబంధం లేకుండా తన తరువాత తనంతటి వాడు కేటీఆర్ మాత్రమే అనే బిల్డప్ ఇచ్చేశారు కేసీఆర్. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ రెండో సారి విజయం సాధించిన వెంటనే పార్టీలో చర్చకు పెట్టడం వంటివి ఏవీ లేకుండానే కేటీఆర్ కు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కట్టబెట్టారు. తన తరువాత సీఎం కేటీఆర్ అంటూ స్పష్టంగా అందరికీ తెలిసేలా చేశారు. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతాయా అన్న శంకను కూడా దరి చేరనీయలేదు. కానీ స్వయంగా ఆయనకే హరీష్, ఈటల శక్తి సామర్థ్యాలు తెలుసుకనుక వారిద్దరికీ తన ఆశీస్సులు లేవని పార్టీ నేతలకు, క్యాడర్ కూ చెప్పకనే చెప్పే విధంగా రెండో సారి గెలిచిన వెంటనే ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో వారికి చోటు ఇవ్వలేదు. ఇలా వారిని దూరం పెట్టిన కేసీఆర్ ఆ తరువాత అనివార్యంగా కేబినెట్ విస్తరణలో వారికి స్థానం కల్పించారు. సరే హరీష్ కు ఆర్థిక శాఖ, ఈటలకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. బంధుత్వం కారణంగానో, మరో కారణమో తెలియదు కానీ, హరీష్ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించిన కేసీఆర్ ఈటలను మాత్రం పొగపెట్టి పంపేశారు.
ఏ నాయకుడికైనా సరే ఆయన సమర్థత, సత్తా బయటపడేది పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే.. అయితే ఈ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేటీఆర్ కు అటువంటి పరిస్థితి, అవసరం రాలేదు. ఎందుకంటే ఆయన గోల్డెన్ స్పూన్ తో అధికారంలోకి వచ్చారు. పార్టీ అధినేత బిడ్డగా.. సీనియర్ మంత్రులు నేతలు సైతం ఆయనను కాబోయే సీఎం అంటూ బహిరంగ సభలలోనే ఆకాశానికి ఎత్తేశారు. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న సమయంలో పార్టీని తన కనుసన్నల్లో నడిపిన కేసీఆర్.. తన కుమారుడు కేటీఆర్ తనంతటి నేతగా పార్టీ నేతలకు, కేడర్ కు చూపించారు. చివరాఖరకు ఈటలకు జరిగిన మర్యాద చూసిన తరువాత హరీష్ కూడా కేసీఆర్ మనసెరిగి నడుచుకున్నారు. ఎలాంటి అభ్యంతరాలూ లేకుండా కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన వెంట నడిచారు. అలా నడిస్తే తప్ప పార్టీలో మనుగడ కష్టమని తలచారు. అయితే ఒక్క ఓటమి పరిస్థితిని తల్లకిందులు చేసేసింది. విపక్షంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని దీటుగా స్పందించే విషయంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కేటీఆర్ తేలిపోతున్నారు. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయట పడేయడానికి హరీష్ తప్ప మరో దిక్కులేకుండా పోయిందని పార్టీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరిగేష్ వ్యవహారాలలో సభలో మాట్లాడేందుకు అవసరమై సబ్జెక్ కేటీఆర్ వద్ద లేదని పార్టీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి. తాజాగా సభలో కాళేశ్వరంపై జరిగిన చర్చలో కేటీఆర్ మౌనమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
అసలు పార్టీ ఓటమి తరువాత కేసీఆర్ సభకు వస్తారని ఎవరూ భావించలేదు. అటువంటిది ఆయన స్వయంగా ప్రతిపాదించినా కేటీఆర్ ను బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు నిరాకరించడంతో అనివార్య పరిస్థితుల్లో సభలో విపక్ష నేతగా ఆయనే ముందకు వచ్చారు. అయినా ఆయన విపక్ష నేతగా సభలో కూర్చోవడానికి ఇంకా సిద్ధం కాలేదు. తన కుమారుడు కేటీఆర్ ను ఇబ్బందికర పరిస్థితి నుంచి అంటే హరీష్ నేతృత్వంలో పని చేసే పరిస్థితి నుంచి తప్పించడానికి ఆయనే బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన సభకు హాజరు కాలేదనుకోండి అది వేరే సంగతి. కీలకమైన బడ్జెట్ సమావేశాలు, ఇరిగేషన్ పై చర్చ వంటి వాటికి కూడా గైర్హాజరైన కేసీఆర్, తన ఆబ్సెన్స్ లో కేటీఆర్ నిష్క్రియాపరత్వం బాగా ఇబ్బంది పెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఇరిగేషన్ పై చర్చలో హరీష్ క్రీయాశీలంగా వ్యవహరించారు. దీంతో కేటీఆర్ వల్ల పార్టీకి భారమే తప్ప మరో ప్రయోజనం లేదని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నాయి.
కాశేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా తన మౌనాన్ని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్న కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఆ చర్చలో హరీష్ ఒంటరి పోరు చేశారంటూ అభినందించడాన్ని నెటిజనులు ఓ రేంజ్ లో ఏకి పారేస్తున్నారు. పార్టీలో నంబర్ 2గా ఉండి మీరు చేసిందేమిటంటూ నిలదీస్తున్నారు. సభలో ఉండి మీరు చేసిందేమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ తర్వాత అంతా తానే అన్నట్లు వ్యవహరించిన కేటీఆర్ విపక్షంలో మాత్రం బేక్ బెంచ్ కు పరిమితమవ్వడమేమిటని కడిగి పారేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ మొత్తం కేటీఆర్ ను కాదని హరీష్ వెంట ర్యాలీ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. ఈ పరిస్థితి కేటీఆర్ కు ఎలా ఉందన్నది పక్కన పెడితే కేసీఆర్ కు మాత్రం ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.