ఏపీలో రేవంత్ ప్రచారం.. జగన్ కు ఇక చుక్కలే! | revanth to campaign in ap| jagan| worry| start| return| gift| karnataka| cm
posted on Feb 17, 2024 6:00AM
రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సైతం సత్తా చాటేందుకు కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఓ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని.. అది కూడా రాయలసీమలో.. అందునా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోంది. అలాగే ఈ సభకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరు కానున్నారు. ఇక తెలంగాణ కేబినెట్‌లోని కీలక మంత్రులు మరీ ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు జిల్లాలకు చెందిన పార్టీలోని కీలక నేతలు సైతం ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడి వివాహ వేడుకల్లో బిజీ బిజీగా ఉన్నారు.. ఆ తర్వాత అంటే పిబ్రవరి చివరి వారంలో.. అంటే ఫిబ్రవరి 25వ తేదీ అదివారం ఈ సభ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు జన సమీకరణ కోసం హైదరాబాద్ మహానగరంతోపాటు ఆంధ్రాలోని విశాఖ, విజయవాడ తదితర నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అదీకాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌లో మంచి క్రేజ్ ఉందని.. అలాగే ఆయనకు భారీగా ఫాలోవర్స్ కూడా ఉన్నారని… అలాంటి వేళ.. ఆయన హాజరయ్యేలా ఏపీలో ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే.. పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇక వైయస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయిందని.. అమె ప్రజల మధ్యకు బాణంలా దూసుకు పోతుండడమే కాకుండా.. సొంత సోదరుడు వైయస్ జగన్ పాలనపై విమర్శనాస్త్రాలను సంధిస్తుందని.. దాంతో ప్రజల్లో వైయస్ షర్మిలకు మంచి క్రేజీ ఏర్పడిందని, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కేసీఆర్ పాలనపై ఆయన ఏ విధంగా విమర్శలు సంధించారో.. అదే విధంగా వైయస్ జగన్ పాలనపై వైయస్ షర్మిల వ్యవహార శైలి ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ మద్య వార్ తారస్థాయికి చేరింది. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. పార్టీని ఆంధ్రాలో విస్తరించి.. గుంటూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి.. ఓ అధ్యక్షుడిని కూడా నియమించారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీని తెలంగాణ ఓటర్లు ప్రతిపక్షానికి పరిమితం చేయడంతో.. గుంటూరులోని కారు పార్టీ కార్యాలయాన్ని మూసేశారని..
అయితే ఇదే కేసీఆర్ అధికారంలో ఉండగా.. విశాఖ లేదా విజయవాడ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినా, కార్యరూపం మాత్రం దాల్చ లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు, ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి… అక్కడ పార్టీ ప్రచారానికి వెళ్లి రమ్మని ఇలా ఆదేశిస్తే.. అలా రేవంత్ రెడ్డి శిరసావహిస్తారంటున్నారు.
అదీకాక ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తనతో పాటు తన పార్టీ ఓటమి కోసం.. ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైయస్ జగన్.. తెర చాటు మంత్రాంగం నెరపారని.. దానికి అంతకు అంత రుణం తీర్చుకునేందుకు.. సీఎం రేవంత్ రెడ్డికి ఇదే తగిన సమయమని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే వాడి వేడిగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. ఏపీలో రేవంత్ రెడ్డి అడుగు పెడితే.. మాత్రం అక్కడ రాజకీయ రసవత్తరంగా మారుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.