Leading News Portal in Telugu

కాళేశ్వరం చాప్టర్ క్లోజ్? సాగునీటికి దిక్కేది? | kaleswaram chapter close| big| damage| kcr| brs| loksabha| elections| congress| plus| point


posted on Feb 19, 2024 10:48AM

ఆహా..ఓహో అంటూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం తన భుజాలను తానే చ రుచుకుంటూ గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆ ప్రాజెక్టు డిజైన్ లోనే లోపం, నిర్మాణంలో అవకతవకలు, నాసిరకం పనులు కారణంగా అది ఒక పనికిరాని ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ చేసిన చేస్తున్న విమర్శలు వాస్తవమేనా అనిపించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయి. బీటలు వారాయి.

మేడిగడ్డలో ఇక నీరు నింపడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాళేశ్వరంలో భాగంగా ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజిల పరిస్ఖితి కూడా అంతేనని అంటున్నారు.  వీటి నాణ్యత, పటిష్టతపై  నిపుణులు తేల్చే వరకూ వాటిని పూర్తి చేయలేని, అలాగే కూల్చలేని పరిస్థితి ఏర్పడింది. అంటే కేవలం అలంకారప్రాయంగానే అంటూ నిరర్ధకంగానే ఆ ప్రాజెక్టులు మిగిలిపోనున్నాయి.  ప్రాజెక్టుల నాణ్యత, డిజైనింగ్ లపై వస్తున్న విమర్శలు, మేడిగడ్డ కుంగుబాటు కారణంగా తన ఇమేజికి వచ్చిన డ్యామేజినీ సమర్థించుకునే అవకాశం లేక మౌనముద్ర వహించారు. ఏదో నల్గొండ సభలో ఆవేశంగా, ఆగ్రహంగా మేడిగడ్డ సందర్శనకు వెళ్లి కాంగ్రెస్ నేతలు ఏం పీకుతారు అంటూ తన వాగ్ధాటిని ప్రదర్శించినా అది ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజీ చేసింది తప్ప మరో ప్రయోజనం లేకుండా పోయింది. 

దేశానికే ఆదర్శం, రోల్ మోడల్, బీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు, కోటి ఎకరాలను సాగులోకి తీసుకురావాలన్న చిత్తశుద్ధికి, సంకల్పానికీ నిదర్శనం అంటూ ఆ ప్రాజెక్టు ప్ురారంభం సమయంలో బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది.  ఇంజినీర్లకే కేసీఆర్ పాఠాలు చెప్పే విధంగా ఈ ప్రాజెక్టు  ప్లానింగ్, డిజైనింగ్ అన్నీ ఆయనే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది.  అయితే  ఒక్కటొక్కటిగా బ్యారేజీలోని లోపాలు బయటపడుతుండటంతో.. బీఆర్ఎస్ సమర్థించుకోలేక, లోపాలను కప్పిపుచ్చలేక పీకలోతు చిక్కుల్లో ఇరుక్కు పోయింది. 

 బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ అత్యంత ప్రాధానమైనదని గొప్పగా చెప్పుకుంది. ఆ ప్రధానమైన మేడిగడ్డే ఇప్పుడు ఎందుకూ పనికిరాని పరిస్థితికి చేరింది. నీటి నిల్వకు అవకాశం, ఆస్కారం లేకుండా మిగిలింది. దీంతో అన్నారం, సుందిళ్ల లకు నీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోయింది.  అంటే కాళేశ్వరం పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనాలను పెంచేసి నిర్మించిన మూడు ప్రాజెక్టులూ ఇప్పుడు నిరర్ధకంగా మారిపోయాయి.  

మేడిగడ్డ పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ సర్కార్ పెద్ద రాద్ధాంతం చేస్తోంది. గతంలో ఏ ప్రాజెక్టు విషయంలోనూ ఇలా జరగలేదా? కొత్త ప్రాజెక్టు అన్నాకా కొన్ని రిపేర్లు రావడం సహజం అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలు చేసిన, చేస్తున్న ప్రకటనలు  ఆ పార్టీ ఇమేజ్ ను, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ ను మరింతగా పతనం చేస్తున్నాయి.  

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అయినా సరే ఆయన స్వయంగా స్వయంగా ఆయనా వెళ్లి పరిశీలించలేదు. అధికారులతో సమీక్షించనూ లేదు. సంఘటన జరిగిన వెంటనే అదో పెద్ద సమస్యే కాదంటూ అప్పటి మంత్రులు  కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యలు చేశారు. మరమ్మతుల విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం నుంచీ కానీ, అధికారుల నుంచి కానీ ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.  

అన్నిటికీ మించి ప్రస్తుత పరిస్థితుల్లో  కాళేశ్వరం పూర్తిగా నిరుపయోగంగా మారిన నేపథ్యంలో  సాగు ఎలా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ప్రాణహిత ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూ ప్రస్తుత ఇరిగేషన్ మంత్రి మంత్రి ఉత్తమ్ అంటున్నారు. అయితే  కాళేశ్వరం నిరర్థకంగా మారడంతో వర్షాకాలంలో వరద నీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కాళేశ్వరం వైఫల్యమే పెద్ద మైనస్ గా మారనుంది.