Leading News Portal in Telugu

హస్తిన పర్యటన పొత్తు కోసమేనా కేసీఆర్!? | kcr delhi tour this week| alliance| bjp| kaleswaram| support| appointment| modi


posted on Feb 19, 2024 3:23PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హస్తినకు వెడుతున్నారు.  ఈ వారంలోనే ఆయన హస్తిన పర్యటనకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన హస్తిన పర్యటనకు వెళ్లడం ఇదే మొదటి సారి అవుతుంది. సరిగ్గా లోక్ సభ ఎన్నికల ముందు ఆయన హస్తనయానానికి బయలుదేరడం హాట్ టాపిక్ గా మారింది. 

ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయడం, మేడిగడ్డ కుంగుబాటుకు డిజైన్ లోపాలే కారణమని విస్ఫష్టంగా ప్రకటించడం, అలాగే కాగ్ నివేదిక కూడా కాళేశ్వరం లోపాలను బట్టబయలు చేయడంతో ఆయన హస్తిన పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. చిక్కుల నుంచి బయటపడేందుకు, అలాగే లోక్ సభ ఎన్నికలలో బీజేపీతో బీఆర్ఎస్  పొత్తు విషయంలో  విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లభించింది.  

రాష్ట్రంలో  అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడం, కాళేశ్వరం అవినీతి పుట్టగా అభివర్ణిస్తూ కేసీఆర్ నిర్ణయాలపై విమర్శలు గుప్పిస్తూ,   ళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో ఎవరినీ స్పేర్ చేసేది లేదంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసీఆర్ హస్తిన పర్యటనకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది  పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పొత్తుల విషయం చర్చించేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ఉభయ తారకంగా పొత్తుల చర్చలతో పాటు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమకు అండగా నిలవాలని కూడా ఆయన బీజేపీ అధిష్ఠానాన్ని కోరే అవకాశాలున్నాయంటున్నారు. త్వరలో అంటే ఈ వారంలోనే కేసీఆర్ హస్తినకు బయలుదేరనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే హస్తినలో కేసీఆర్ ఎవరెవరితో చర్చిస్తారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాల అప్పాయిట్ మెంట్ లు లభించాయా అన్న విషయంపై అయితే ఇప్పటి వరకూ స్పష్టత లేదు. 

అయితే ఇటీవల ఒక సందర్భంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్డీయేలోకి పాత మిత్రులే కాదు, కొత్త మిత్ురులు కూడా చేరనున్నయి అంటూ చేసిన ప్రకటన బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలకు బలం చేకూరుస్తోంది.   ఈ   నేపథ్యంలోనే  కేసీఆర్ ఢిల్లీ పర్యటన పొత్తు పొడుపునకే నని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.