Leading News Portal in Telugu

తెలంగాణ బీజేపీలో మళ్లీ లుకలుకలు.. ఎన్నికల ముంగిట క్యాడర్ లో అయోమయం! | internal differencess in telangana bjp| loksabha| elections| party| performance| effect| dhamapuri| nizamabad


posted on Feb 19, 2024 2:43PM

సార్వత్రిక ఎన్నికల ముంగిట తెలంగాణ బీజేపీలో మునుపెన్నడూ ఎరుగని గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ నాయకుల తీరు ఎవరికి వారే యమనా తీరే అన్నట్లుగా తయారైంది. ఒక వైపు ఈటల బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారన్న వార్తలు హల్ చ ల్ చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు,  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య విభేదాల వార్తలతో పార్టీ కేడర్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు వ్యతిరేకంగా కొందరు పార్టీ నేతలు కరపత్రాలు ముద్రించారు.

గత కొంత కాలంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ సీనియర్లు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కరపత్రాలు ముద్రించి సంచలనానికి తెరలేపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో ధర్మపురి అర్వింద్ కు పార్టీ టికెట్ ఇవ్వవద్దని అధిష్ఠానాన్ని కోరుతూ ముద్రితమైన ఆ పాంప్లెట్లు సోమవారం (ఫిబ్రవరి 19) దిపపత్రికలతో పాటు పంపిణీ  అయ్యాయి.  కళ్లకు చలవ కళ్లద్దాలు తీయడు, కారు దిగి ప్రజలతో మాట్లాడని ధర్మపురి నియంత, అహంకారి.. అటువంటి వ్యక్తి నిజామాబాద్ ఎంపీగా వద్దు అంటూ ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.  కృష్ణమాచారి, పి.గంగాధర్, కే. శ్రీనివాస్, బి. రమేష్ పేర్లతో ముద్రితమైన ఈ కరపత్రాలు ఇప్పుడు నిజామాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా బీజేపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం పార్టీ క్యాడర్ ను నిరాశా నిస్ఫృహలకు గురి చేసింది. కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సమావేశం బండి సంజయ్ సన్మాన సభ మాదిరిగా జరగడమే పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టింది. అప్పటి వరకూ రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా ఉన్న బీజేపీ పరిస్థితి అక్కడ నుంచి వేగంగా దిగజారి పోయింది. చివరికి అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ డిజిట్ కు పరిమితమైంది.

అప్పట్లో పార్టీలో అంతర్గత విభేదాలకు తోడు బీఆర్ఎస్ తో లోపాయికారీ మైత్రి ఉందన్న ఆరోపణలు బలంగా రావడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితి పునరావృతమౌతున్నది. పార్టీలో విభేదాలు భగ్గుమనడంతో పాటు..  కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచినా మేడిగడ్డ పరిశీలనకు బీజేపీ డుమ్మా కొట్టడం, బీఆర్ఎస్ ఎన్డీయేలో చేరేందుకు బీజేపీ హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలలో బీజేపీ తెలంగాణలో మరోసారి చతికిలబడటం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.