కోవర్ట్ ఆపరేషన్ ఫెయిల్.. తిరిగి వైసీపీ గూటికే ఆళ్ల? | covert operation fail| alla| returns to ycp| mangalagiri| lokesh| win| fix| jagan
posted on Feb 20, 2024 3:50PM
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి సర్వేల ఫలితాలు నిద్రను కూడా దూరం చేస్తున్నాయి. బహిరంగ సభల్లో నవ్వుతూ కనిపించినా, చొక్కా చేతులు మడతపెట్టే సమయం వచ్చేసిందంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వచ్చేఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం ఆయన్ను అనునిత్యం వెంటాడుతున్నట్లు వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తున్నట్లు తను సొంతంగా నిర్వహించుకున్న సర్వేలు సైతం తేటతెల్లం చేస్తుండటంతో.. .జగన్ గజగజలాడిపోతున్నారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని పడరానిపాట్లు పడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా సర్వేల ద్వారా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించిన జగన్.. కొందరి నియోజకవర్గాలను మార్పులు చేర్పులు చేశారు. వీటిల్లోనూ మళ్లీ సర్వే పేరుతో మార్పులు చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంపై దృష్టిసారించిన జగన్ మోహన్ రెడ్డి.. అక్కడ ఎలాగైనా గెలవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ విజయం సాధించేది లోకేషేనని సర్వేల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని, ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో నిలిస్తే వైసీపీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రావని సర్వే ఫలితాలు తేటతెల్లం చేశాయట. దీంతో ఓటమి సంగతి దేవుడెరుగు.. కనీసం లోకేష్ మెజార్టీనైనా తగ్గించేందుకు ప్రయత్నాలు చేయాలని వైసీపీ నేతలకు జగన్ హుకుం జారీ చేశారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో అగ్రనేతలు రంగంలోకి దిగి నియోజకవర్గంలో కాస్తో కూస్తో క్యాడర్ కలిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు పలు విధాల ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు ఫలించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ సమక్షంలో మళ్లీ వైసీపీలో చేరిపోయాడు. ఈ సందర్భంగా ఆళ్లకు, స్థానిక వైసీపీ నేతలకు జగన్ పలు విషయాలపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ.. మంగళగిరిలో లోకేశ్ మాత్రం గెలవకూడదని జగన్ వారికి సూచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చి, లోకేష్ మంగళగిరిలో గెలిస్తే వైసీపీ క్యాడర్ చెల్లాచెదురవుతుందని, అలా జరగకుండా ఉండాలంటే మంగళగిరిలో లోకేష్ విజయాన్ని అడ్డుకోవాలని జగన్ వారికి జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ వైఖరి రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయానికి పెద్ద అడ్డంకిగా మారబోతుందని సర్వే ఫలితాల్లో తేలడంతో వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో రాజధాని అంశం చాపకింద నీరులా వైసీపీని ముంచేస్తుందని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో జగన్ నానా తంటాలు పడుతున్నారు. లోకేశ్ పై బీసీ అభ్యర్థిని బరిలో నిలిపి బీసీ కార్డ్ వాడాలని, తద్వారా లోకేష్ ను దెబ్బకొట్టొచ్చనే భావనకు జగన్ వచ్చారు. అయితే, కులాలకు అతీతంగా ప్రజలు లోకేష్ కు జై కొడుతుండటం జగన్ కు మింగుడు పడని అంశంగా మారింది. ఈ క్రమంలో టికెట్ రాదనే భావనతో ఇటీవల పార్టీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీలో లోకి రావడం కొంత బలం చేకూరుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. వైసీపీలో చేరిన తరువాత ఆళ్ల మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గం నుంచి బీసీ అభ్యర్థే బరిలోకి దిగుతారని చెప్పారు. ఇప్పటికే మంగళగిరి ఇంచార్జిగా జగన్ మోహన్ రెడ్డి గంజి చిరంజీవిని నియమించారు. కానీ, అతన్ని మార్పు చేసి మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమలను మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలో నిలుపుతారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వారం రోజుల తరువాత వచ్చే సర్వే ఆధారంగా నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరో తేలనున్నట్లు సమాచారం.
ఇలా ఉంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరడం పై మరో వాదన కూడా ఆ పార్టీ నుంచే గట్టిగా వినిపిస్తోంది. ఆళ్ల తిరిగి వైసీపీ గూటికి చేరడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే అంశం కాదనీ, ఎందుకంటే.. ఆళ్ల కాంగ్రెస్ లోకి వెళ్లడం.. జగన్ మోహన్ రెడ్డి ఆపరేషన్ లో భాగమేనని వైసీపీ నేతలే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన నాటినుంచి వైఎస్ షర్మిలకు తానే వ్యూహకర్తను అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన ఆళ్ల అసలు షర్మిల పంచన చేరిందే వైసీపీ కోవర్టుగా అని అంటున్నారు. కాంగ్రెస్ లో చేరిన నాటినుంచి రాజకీయంగా షర్మిల వేసే ప్రతి అడుగును ఆళ్ల తెలుసుకొని తాడేపల్లి ప్యాలెస్ కు సమాచారం అందజేస్తున్నారని చెబుతున్నారు. అంటే కోవర్ట్ ఆపరేషన్ కోసం ఆళ్లకు జగనే వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి పంపించారని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన షర్మిల ఆళ్ల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టడంతో కోవర్ట్ ఆపరేషన్ ఫెయిలైందనీ, దీంతో మరో దారి లేక ఆళ్ల తిరిగి వైసీపీలో చేరిపోయారనీ పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. ఆళ్ల వ్యవహారం ఎలా ఉన్నా, మంగళగిరిలో లోకేశ్ కు అన్ని వర్గాల ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుండటాన్ని జగన్ తట్టుకోలేక పోతున్నారనీ, అక్కడ లోకేష్ విజయాన్ని అడ్డుకోవడం కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతున్నారనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. మళ్లీ అవే శ్రేణులు జగన్ ఏం చేసినా, మంగళగిరిలో లోకేశ్ విజయాన్ని అడ్డుకోవడం అసాధ్యమని కూడా చెబుతున్నాయి. ఇప్పటికైనా ఆయన మంగళగిరిలో పార్టీ ఓటమిని అంగీకరించి, మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి సారిస్తే మంచిదని కూడా వారు భావిస్తున్నారు. మొత్తం మీద ఆళ్ల ఇలా వైసీపీని వదిలి కాంగ్రెస్ గూటికి వెళ్లి అలా తిరిగి వచ్చేయడంతో ఆళ్లకు మంగళగిరిలో ఉన్న అంతో ఇంతో ఇమేజ్ కూడా దారుణంగా పతనమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.