బెడిసి కొడుతున్న జగన్ వ్యూహాలు.. దెబ్బతింటున్న అంచనాలు! | jagan strategies fail| election| fear| schemes| funds| nil| powercuts| party| cadre
posted on Feb 21, 2024 8:45AM
జగన్ ఆశలు ఒక్కటొక్కటిగా నీరుగారిపోతున్నాయి. ఎన్నికల ముంగిట ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. సిట్టింగుల మార్పు వ్యూహం దారుణంగా దెబ్బతింది. పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. ఇప్పుడు పోటీకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ పక్కన పెడితే యాక్చువల్ షెడ్యూల్ కు ఓ నెల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందన్న ఆయన అంచనాలూ దెబ్బతిన్నాయి.
మూడు నెలల కిందటే ఆయన ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ నేతలకూ, క్యాడర్ కూ పిలుపు నిచ్చారు. ఈ సారి నిర్ణీత సమయం కంటే ఓ నెల రోజుల ముందే షెడ్యూల్ విడుదలౌతుందని గట్టిగా చెప్పారు. అలా జరిగితే కోడ్ పేరుతో పథకాలు నిలిచిపోతాయనీ, అప్పుడు నిధుల కొరత ఉండదనీ ఆయన భావించారు. అలాగే నీర్ణీత గడువు ప్రకారమే ఎన్నికల షెడ్యూల్ వస్తే సరిగ్గా ఎన్నికల సమయంలో విద్యుత్ కోతలు, ఆర్థిక కష్టాలతో జగన్ సర్కార్ చిక్కుల్లో పడుతుంది. దీంతో ఆయన షెడ్యూల్ ప్రకారం కాకుండా ఎన్నికలు ఓ నెల ముందు అంటే మార్చి మొదటి వారంలో జరిగితే బాగుండునని తలచారు. పై నుంచి అంటే కేంద్రం నుంచి ఏం హామీ వచ్చిందో తెలియదు కానీ, మూడు నెలల ముందరే నిర్ణీత షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే షెడ్యూల్ వచ్చేస్తుందనీ, ఎన్నికలు కూడా మార్చి మొదటి వారంలో జరిగుతాయనీ పార్టీ నేతలు, క్యాడర్ కు భరోసాగా చెప్పేశారు. అయితే ఆ పరిస్థితి ఎంత మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూల్ మార్చి 2వ వారంలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి మూడో వారంలోనే ఏపీలో విద్యుత్ కోతలు షురూ అయిపోయాయి. రానున్న రోజులలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ ఎలాగోలా నెట్టుకొచ్చిన బటన్ నొక్కుడు కార్యక్రమం కూడా సాధ్యం కాని ఆర్థిక దుస్థితిలో జగన్ ఉన్నారు. షెడ్యూల్ పేరు చెప్పి బటన్ నొక్కుడును ఎగ్గొట్టోచ్చని భావించిన జగన్ కు షెడ్యూల్ నిర్ణీత సమయానికే వస్తుండటంతో ఆ చాన్స్ లేకుండా పోయింది. ఈ నెల రోజులూ ఎలాగోలా పబ్బం గడిపేందుకు వీలుగా అప్పు కోసం ఆయన డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారు. అన్ని దారులూ మూసుకుపోవడంతో త్వమేవ శరణం నాస్తి అంటూ మోడీకి మొరపెట్టుకోవడానికి శతథా ప్రయత్నిస్తున్నారు. అయితే గత పది రోజులుగా కోరుతున్నా ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ దొరకడం లేదు. మొత్తం మీద జగన్ అంచనాలు తప్పి గడ్డు పరిస్థితులను ఎదుర్కొటున్నారనడంలో సందేహం లేదు.
ఒక వైపు పార్టీలో అసంతృప్తి, మరో వైపు ఓటమి ఖాయమైపోయి.. పార్టీ శ్రేణుల్లో అసహనం పెరిగి ప్రత్యర్థులపైనే కాకుండా జర్నలిస్టులపైకి కూడా దాడులకు తెగబడే పరిస్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితులనే చక్కదిద్దాలో అప్పు కోసం హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో జగన్ పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.