జగన్ ఖేల్ ఖతం..దుకాణ్ బంద్! తేల్చేసిన మరో సర్వే | jagan defeat sure| another| survey| reveals| tdp| janasenam alliance| bjp| join| sharmila
posted on Feb 21, 2024 10:25AM
ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఏపీలో అధికార వైసీపీ గ్రాఫ్ రోజురోజుకు దిగజారిపోతోంది. అధ:పాతాళానికి పడిపోతోంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు తోడు.. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్ననిర్ణయాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. జగన్ నిర్ణయాతో వైసీపీ క్యాడర్ లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో వైసీపీలో ఉంటే ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి ఎదురవుతుందన్న భావనకు ఆ పార్టీ నేతలు వచ్చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ ప్రమఖ సర్వే ఫలితం కూడా తేటతెల్లం చేసింది.
ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 నుంచి 50 సీట్లకు మించి వైసీపీకి వచ్చే పరిస్థితి లేదని తేలింది. ఎన్నికల సమయం నాటికి జగన్ తీరులో మార్పురాకుంటే ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందన్న సంకేతాలు ఈ సర్వే ఫలితం ద్వారా వెల్లడవుతున్నాయి. పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీకి ఘోరపరాభవం తప్పదని సర్వే తేల్చింది. కేవలం 7 నుంచి 8 పార్లమెంట్ స్థానాల్లో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, తెలుగుదేశం, జనసేన కూటమిలో బీజేపీ కూడా కలిస్తే వైసీపీ గెలిచే పార్లమెంట్ స్థానాల సంఖ్య ఐదుకు పడిపోయినా ఆశ్చర్యం లేదన్నది తాజా సర్వే చెబుతోంది.
పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తాజాగా సర్వే ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి మొదటి రోజు నుంచి 14వ తేదీ వరకు 175 నియోజకవర్గాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 90వేల మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో అత్యధికశాతం మంది టీడీపీ – జనసేన పార్టీలకే మా మద్దతు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీ, జనసేన కూటమికి 52శాతం ఓట్లు, వైసీపీకి 42శాతం ఓట్లు వస్తాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగిందని సర్వే ఫలితం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి 2.4శాతం ఓటు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభావం వైసీపీపై అధికంగా పడనుందని సర్వే ఫలితాన్ని బట్టి అర్ధమౌతోంది. ఇప్పటికే ప్రముఖ సంస్థలు నిర్వహించిన సర్వే ఫలితాల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేల్చగా.. తాజాగా పయనీర్ పోల్ సర్వే సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. జగన్ చేయించిన సర్వేలలోనూ ఫలితాలు ఇదే తరహాలో వచ్చాయని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఏపీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. అమరావతి రాజధానిని జగన్ నిర్వీర్యం చేసి చేశారు. మూడు రాజధానులంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాజధాని రైతులపై జగన్ వ్యవహరించిన తీరు ఆ పార్టీకి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అమరావతి రైతుల పట్ల జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ వచ్చింది. పోలీసులతో కొట్టిస్తూ వారిని నానా ఇబ్బందులకు గురిచేసింది. అయినా, రైతులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా జగన్ ప్రభుత్వంపై ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. దీంతో ఒక్క అమరావతి పరిసర ప్రాంతాల్లోని ప్రజల నుంచే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అమరావతి రైతులకు మద్దతు లభిస్తోంది. మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ల కేటాయింపు విషయంలో షాకిస్తున్నారు. ఇప్పటికే అరవైకిపైగా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను తొలగించిన జగన్.. వారిలో కొందరిని మాత్రం వేరే నియోజక వర్గాల నుంచి బరిలోకి దింపుతున్నారు. దీంతో నియోజకవర్గాల వారిగా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగున్నారేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపించిన పరిస్థితి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలోనూ ఇదే తీరును జగన్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన సిద్ధం సభల్లో ప్రజలను రెచ్చగొట్టేలా సీఎం జగన్ మాట్లాడుతున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఓ టీవీ చానెల్ కెమెరామెన్ పై దాడి చేయగా.. తాజాగా ఓ ప్రముఖ దినపత్రిక కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఈ వ్యవహారాలన్నీ గమనిస్తున్న ప్రజలు.. జగన్ కు మరోసారి అధికారాన్ని అప్పగిస్తే ఏపీ కాస్తా కక్షపూరిత రాజకీయాలకు కేంద్రంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈసారి వైసీపీని ఓడించేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారనీ, అదే విషయం సర్వేలలో తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.