posted on Feb 26, 2024 10:45AM
తన ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పోస్టింగ్స్ చేస్తున్నట్లు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ లో పిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా తనను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెడుతూ, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్ సహా ఎనిమిదిమందిపై వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని.. అయితే ఈ సందర్భంగా కొందరు దురుద్దేశంతో తనపైనా, తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని షర్మిల పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని అన్నారు. అలాగే తన గురించి కొన్ని పీడీఎఫ్ పోస్టులను
సోషల్ మీడియాలో సర్క్కులేట్ చేస్తున్నారని షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు, పోస్టులతో తన వ్యక్తిత్వాన్ని దిగజార్చుతున్నారని.. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌క్రైమ్ పోలీసులను కోరారు.మరోవైపు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేసిన వారిలో సినీ నటి శ్రీరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, మేదరమెట్ల కిరణ్‌కుమార్, రమేశ్ బులగాకుల, ఆదిత్య, సత్యకుమార్ దాసరి, సేనాని, మహ్మద్ రెహ్మత్ పాషా ఉన్నారు. షర్మిల ఫిర్యాదును ఆమె భర్త అనిల్ కుమార్ పోలీసులకు అందజేశారు. షర్మిల ఫిర్యాదుతో ఎనిమిది మందిపై రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.