posted on Feb 26, 2024 4:20PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మొత్తం ఆరు గ్యారెంటీల అమలు కార్యరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను అమలు చేయడానికి సిద్దమైంది. మహలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే సబ్సిడీ సిలిండర్, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ రెండు గ్యారెంటీలను ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగా గాంధీ రానున్నారు. అయితే ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ నెల 27న ప్రియాంక గాంధీ చేతుల మీదుగా చేవెళ్ల బహిరంగ సభ వేదికగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని కాంగ్రెస్ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. కానీ అనివార్య కారణాలతో రేపటి ఆమె పర్యటన రద్దయింది. అయితే ఆమె వర్చువల్‌గా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ గ్యారెంటీలను ప్రారంభించనున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇందులో ఇప్పటికే రెండు గ్యారంటీలను పాక్షికంగా అమలు చేశారు. రేపు మరో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నారు.