Leading News Portal in Telugu

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ జీరో.. తెలుగేదేశం కూటమి క్లీన్ స్వీప్ ఖాయం?! | ycp zero in nellore| 2019| elections| situation| reverse| 2024| tdp


posted on Feb 26, 2024 10:19AM

ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా కీల‌కం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ జిల్లాలో ప‌ట్టుసాధించేందుకు అన్ని పార్టీలు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతాయి.  గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు ఉమ్మ‌డి జిల్లాలో 10 నియోజ‌క‌వ‌ర్గాలకు గాను పది నియోజకవర్గాలలోనూ వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. టీడీపీకి ఇక్క‌డ ఒక్కటంటే ఒక్క  స్థానం కూడా ద‌క్క‌లేదు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగాయో లేదో పరిస్థితి తారుమారైపోయినట్లు కనిపిస్తోంది.  ఉమ్మ‌డి జిల్లాలో వైసీపీకి ఎదురుగా వీస్తున్నది. దీంతో 2024 ఎన్నికలలో ఈ జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో నిలిచిన విజ‌యం సాధించిన నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్‌ నేత  మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో  చేరారు. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ న‌ర‌స‌రావుపేట ఎంపీగా  ఈసారి బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గానికి  వైసీపీ అధిష్టానం ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను ఎంపిక చేసింది. ఖ‌లీల్ నియామ‌కాన్ని స్థానిక వైసీపీ నేత‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. దీనికితోడు అనిల్ కుమార్ యాద‌వ్ వ‌ర్గానికి, మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ వ‌ర్గీయుల మ‌ధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

 ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నేతగా కొన‌సాగుతున్న రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సైతం వైసీపీకి రాజీనామా చేశారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ల కేటాయింపు విష‌యంలో త‌న‌కు కనీస స‌మాచారం లేకుండా వైసీపీ అధిష్టానం ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకోవ‌టం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వైసీపీని వీడ‌టం ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బేన‌ని చెప్పొచ్చు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలుగుదేశంలో చేరితే ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన కూట‌మి అభ్య‌ర్థుల విజ‌యానికి ఎంతో దోహ‌ప‌డుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. వేమిరెడ్డి   తెలుగుదేశం గూటికి చేరేందుకే   మొగ్గుచూపుతున్నారు. ఆయ‌న‌కు నెల్లూరు ఎంపీగా, టీటీడీ చైర్మ‌న్ గా అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్నది. మొత్తానికి  ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో 2024 ఎన్నిక‌ల్లో వైసీపీకి ఘోర‌ ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌న్న భావన రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ జిల్లాల్లో వైసీపీ పూర్తిగా కొలాప్స్ అయింద‌ని,  2024 ఎన్నిక‌ల్లో 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ తెలుగుదేశం, జనసేన క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని ప‌లు    స‌ర్వేల ఫ‌లితాలు సైతం వెల్ల‌డించాయి. 


ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే..

నెల్లూరు సిటీ ..  


నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో అనిల్ కుమార్ యాద‌వ్ బ‌రిలో నిలిచి టీడీపీ అభ్య‌ర్థి నారాయ‌ణ‌పై విజ‌యం సాధించారు. అనిల్ కుమార్ దూకుడు వ్య‌వ‌హారంతో నెల్లూరు జిల్లాలో వ‌ర్గ‌విబేధాలు నెల‌కొన్నాయి. జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌ర్వేల్లోసైతం అనిల్ పై స్థానిక ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని తేలింది. దీంతో అనిల్ కుమార్ యాద‌వ్‌ ను ఈసారి న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా అధిష్టానం పంపించింది. సిటీ ఇంచార్జిగా ఖ‌లీల్ అహ్మ‌ద్ ను జ‌గ‌న్ నియ‌మించారు. ఖ‌లీల్ అభ్య‌ర్థిత్వంపై వైసీపీలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఖ‌లీల్ స్థానంలో సినీ న‌టుడు అలీని బ‌రిలో నిల‌పాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం, జనసేన కూటమి   అభ్య‌ర్థిగా మ‌రోసారి మాజీ మంత్రి నారాయ‌ణ బ‌రిలోకి దిగుతున్నారు. ఈసారి నారాయ‌ణ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌ని నెల్లూరు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. 

నెల్లూరు.. 


నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో  సైతం వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం సాధించారు.   కొంత‌కాలం క్రితం వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఆయ‌న ఆ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. దీంతో నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డితోపాటు వైసీపీ వ‌ర్గీయులు అనేక మంది తెలుగుదేశంలో చేరారు. శ్రీ‌ధ‌ర్ రెడ్డి స్థానంలో వైసీపీ అధిష్టానం ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డిని నెల్లూరు రూర‌ల్ వైసీపీ ఇంచార్జిగా నియ‌మించింది. అయితే, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి తెలుగుదేశం త‌ర‌పున బ‌రిలో నిల‌వ‌డంతో  తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతే కాకుండా  వైసీపీలోని ఓ వ‌ర్గం ఆయ‌నకు లోపాయికారిగా మ‌ద్ద‌తు తెలుపుతోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో శ్రీ‌ధ‌ర్ రెడ్డి విజ‌యం  ఖాయమని  ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

కావ‌లి.. 


కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి తెలుగుదేం, జనసేన విజ‌యం ఖాయ‌మ‌న్న ధీమాను ఆ పార్టీల‌ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కావ‌లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌తంలో వైసీపీ అభ్య‌ర్థి రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. మ‌ళ్లీ ఆయ‌ననే బరిలోకి దింపే యోచనలో  వైసీపీ అధిష్టానం  ఉంది. 2014, 19 ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్ కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు.  అయితే ప్రస్తుతం ఆయనకు ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతుండటంతో  ప్ర‌జ‌ల్లో రాంరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్య‌తిరేక‌త కనిపిస్తోంది. దీనికితోడు వైసీపీలో వ‌ర్గ‌ విభేదాలు ఆ పార్టీకి పెద్ద స‌మ‌స్య‌గా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్య‌ర్థిగా కావ్య క్రిష్టారెడ్డి బ‌రిలో దిగుతున్నారు. తొలిసారి క్రిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన బ‌లంతోడు కావ‌డంతో క్రిష్ణారెడ్డి విజ‌యం ఖాయంగా క‌నిపిస్తోంది. 

ఉదయగిరి .. 


ఇక ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం విషయానికి వస్తే.. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విజ‌యం సాధించారు. సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో పాల‌న సాగిస్తుండ‌టం, అభివృద్ధిని గాలికొదిలేయ‌డంపై ఆయన ప‌లుసార్లు విమ‌ర్శ‌లు చేశారు. జ‌గ‌న్ తీరులో ఏమాత్రం మార్పురాక‌పోవ‌టంతో ఆయ‌న వైసీపీ వీడారు. ఆ త‌రువాత వైసీపీ అధిష్టానం ఆయన స్థానంలో   మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉంది. దీనికి తోడు గ్రూపు రాజ‌కీయాలు వైసీపీకి త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం,  జ‌న‌సేన అభ్య‌ర్థిగా కాక‌ర్ల సురేష్ బ‌రిలోకి దిగుతున్నారు.  కాక‌ర్ల చారిట‌బుల్ ట్ర‌స్ట్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ఆయన  నియోజ‌క‌వ‌ర్గంలో ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో టైల‌రింగ్ కోర్సు, బ్యూటీషియ‌న్  కోర్సుల‌కు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. దీంతో కాక‌ర్ల‌పై నియోజ‌క‌వ‌ర్గ  ప్ర‌జ‌ల్లో అభిమానం ఉంది. నియోజ‌క‌వ‌ర్గంలో  ఆయనకు ఉన్న‌ మంచిపేరు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు, వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు కాక‌ర్ల విజ‌యానికి క‌లిసొచ్చే అంశాలుగా చెప్పొచ్చు. 

 

గూడూరు.. 

గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలో నూ వైసీపీకి ఎదురీదాల్సిన పరిస్థితే నెలకొని ఉంది.  గ‌త ఎన్నిక‌ల్లో  వైసీపీ అభ్య‌ర్థిగా వెలగపల్లి వరప్రసాద రావు బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. అయితే  ఆయ‌న‌పై నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్తమ‌వుతుండ‌టంతో వైసీపీ అధిష్టానంఆయన స్థానంలో నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జి బాధ్య‌త‌ల‌ను మేరిగ ముర‌ళీధ‌ర్ కు అప్ప‌గించింది. ఆయ‌న తోలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయ‌బోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీలో వ‌ర్గ‌విబేధాలు తార స్థాయికి చేరాయి. దీనికితోడు ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక పాల‌న ప‌ట్ల‌ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో  తీవ్ర ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కు మ‌రోసారి  తెలుగుదేశం అవ‌కాశం ఇచ్చింది. 2019లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి పాశం సునీల్ ఓడిపోయిన సంగతి విదితమే.  అయితే గ‌త ఐదేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఈ క్ర‌మంలో పాశం సునీల్ పై ప్ర‌జ‌ల్లో సానుకూలత  వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో ఈసారి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగర‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు.  

సూళ్లూరుపేట.. 

సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థిగా కిలివేటి సంజీవ‌య్య మూడోసారి బ‌రిలోకి దిగ‌బోతున్నారు. అయితే  వైసీపీలోనే సంజీవ‌య్య‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. ఈ  నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన త‌రువాత నుంచి సంజీవ‌య్య రెడ్డిసామాజిక వ‌ర్గంపై క‌క్ష‌ పూరిత చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌న్న వాద‌న ఉంది. దీంతో ఈసారి వైసీపీలోని ఓ వ‌ర్గం నేత‌లు ఆయ‌న అభ్య‌ర్థిత్వంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో స‌జీవ‌య్య బ‌రిలో నిలిస్తే ఆయ‌న ఓట‌మికి వైసీపీలోని అస‌మ్మ‌తి నేత‌లు కార‌ణం అవుతార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ‌జ‌రుగుతుంది. మ‌రోవైపు తెలుగుదేశం, జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నెల‌వ‌ల సుబ్ర‌హ్మ‌ణ్యం కుమార్తె నెల‌వెల విజ‌య‌శ్రీ బ‌రిలోకి దిగుతున్నారు. ఆమె మొద‌టిసారి ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగుతున్నారు. వైసీపీలోని  వ‌ర్గ‌విబేధాలు, తెలుగుదేశం, జ‌న‌సేన ఓటు బ్యాంకు కలిసి ఆమె విజ‌యానికి దోహ‌ద‌ప‌డ‌తాయ‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు. 

స‌ర్వేప‌ల్లి.. 

స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నుంచి విజ‌యం సాధించిన కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రిగా కొన‌సాగుతున్నారు. కాకానిపై నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్నది. వైసీపీలో వ‌ర్గ‌ విబేధాలు ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మికి కార‌ణ‌మ‌వుతాయ‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. తెలుగుదేశం,జ‌న‌సేన కూట‌మి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇంకా అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి  1994, 1999 మిన‌హా  ఆ త‌రువాత వ‌రుస‌గా నాలుగు సార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వుతూ వ‌స్తున్నారు. ఈసారికూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి అవ‌కాశం ద‌క్కుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

ఆత్మ‌కూరు.. 

ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. దీంతో 2022లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి బ‌రిలో నిలిచి విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన కూట‌మి త‌ర‌పున ఇంకా అభ్య‌ర్థి ఖరారు కాలేదు. అయితే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతోపాటు.. వైసీపీలోని కీల‌క నేత‌లంతా టీడీపీలోకి రావ‌డంతో ఆ ప్ర‌భావం వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తుండ‌టంతో కూట‌మి అభ్య‌ర్థిగా ఎవ‌రు నిలిచినా విజ‌యం ఖాయ‌మ‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

వెంక‌ట‌గిరి..

నెల్లూరు జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి  క్యాడర్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో వెంకటగిరి ఒకటి. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన  ఆనం.. ఏడాది క్రితం ఆ పార్టీతో విభేదించి తెలుగుదేశంలో చేరారు. ఈసారి తెలుగుదేశం తరఫున  వెంక‌ట‌గిరి అభ్య‌ర్థిగా ఆనం బ‌రిలో నిలుస్తార‌ని అంటున్నారు. ఆనం చేరికతో టీడీపీలో  బలం మరింత పెరిగినట్లైంది. ఇక్క నుంచి ఆనం స్థానంలో వైసీపీ  మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఇక్క‌డి నుంచి బ‌రిలో నిలిస్తే వైసీపీ ఓట‌మి ఖాయమ‌న్న భావన స్థానికంగా  వ్యక్తమౌతోంది. 

కోవూరు..

కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి న‌ల్ల‌పునేని ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి విజ‌యం సాధించారు. ఇప్ప‌టికే ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న ఐదుసార్లు విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నుంచే ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.  2024 ఎన్నిక‌ల్లో ప్ర‌స‌న్న కుమార్ రెడ్డి వైసీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగ‌నున్నారు. తెలుగుదేశం త‌ర‌పున  పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తనయుడు దినేష్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2024 ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే.. కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఇంకా ఖ‌రారు చేయ‌లేదు. వైసీపీకి ఇటీవ‌ల రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి టీడీపీలోకి వ‌స్తే ఆయ‌న స‌తీమ‌ణి ప్ర‌శాంతిరెడ్డికి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసే అవ‌కాశం  ఉంటుందన్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఈసారి  ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డిపై వ్య‌తిరేక‌త‌, వైసీపీలో వ‌ర్గ విబేధాలు, జ‌గ‌న్ పాల‌న‌పై వ్య‌తిరేత అన్నీ క‌లిసి టీడీపీ, జ‌న‌సేన అభ్య‌ర్థి విజ‌యానికి బాట‌లు వేస్తాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.