కల చెదిరింది.. వంశీ కథ మారింది! | vallabhanene vamshi facing hard time| gannavaram| tdp| candidate| yarlagadda
posted on Feb 27, 2024 5:37AM
రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉన్నా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గన్నవరం, గుడివాడలో మాత్రం రాజకీయం రంజుగా మారుతోంది. గుడివాడలో వైసీపీ అభ్యర్థిగా మళ్లీ కొడాలి నానినే పోటీ చేస్తుండగా.. ఆయన ప్రత్యర్థిగా తెలుగుదేశం నుంచి వెనిగండ్ల రాము బరిలో దిగుతున్నారు. అయితే కొడాలి నాని వరుసగా గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుంచి వైసీపీ అభ్యర్థిగానే బరిలో దిగుతుండగా, తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాము మాత్రం తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. అంత వరకు ఓకే.
కానీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం చిత్రం.. విచిత్రంగా ఉంది ఎందుకంటే ఈసారి ఫ్యాన్ వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ ఇక్కడ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో..అంటే.. 2019 ఎన్నికలలో వీరిద్దరే ప్రత్యర్థులైనప్పటికీ, ఇప్పుడు వారు పోటీ చేస్తున్న పార్టీలు రివర్స్ అయ్యాయి. అంటే గత ఎన్నికలలో వల్లభనేని వంశీ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉంటే, వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్ బరిలోకి దిగారు. విజయం మాత్రం తెలుగుదేశం అభ్యర్థి వంశీనే వరించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని జగన్ ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగి.. జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు.
ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీలోనే అటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గం, ఇటు వల్లభనేని వంశీ వర్గం ఏర్పడి.. ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. అందులో నుంచి అసమ్మతి రాగం పుట్టుకొచ్చింది. అది మిన్నంటింది. దాంతో యార్లగడ్డ వెంకట్రావ్ వైసీపీకి గుడ్ బై చెప్పి.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా పార్టీలోకి వచ్చిన కొద్ది రోజులకే.. నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీగా యార్లగడ్డను తెలుగుదేశంఅధినేత చంద్రబాబు నియమించారు. దీంతో నాడే గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ పేరు ఖరారు అయింది.
అయితే గన్నవరం నియోజకవర్గం అంటే.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం జెండానే రెపరెపలాడుతుందనీ, ఆ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ ప్రజలు.. దాదాపుగా ఆ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారని.. అలా పట్టం కట్టితేనే.. వరుసగా రెండు సార్లు వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలుపొందారని.. కానీ గత ఎన్నికల తరువాత అధికారం మారడంతో.. ఆయన మనస్సు కూడా మారిందని.. కానీ నియోజకవర్గ ప్రజల మనస్సులు మాత్రం చెక్కు చెదరకుండా.. తెలుగుదేశం వైపే ఉందని, దీంతో గన్నవరంలో వరుసగా సైకిల్ పార్టీ జెండా రెపరెలాడుతోందని… అందుకే ఈ సారి గెలిచేది.. ఎమ్మెల్యే పదవి చేపట్టేది మాత్రం యార్లగడ్డ వెంకట్రావేనన్న స్థానికుల్లో హల్‌చల్ చేస్తోంది.
మరోవైపు వల్లభనేని వంశీ పార్టీ మారితే మారాడు.. తనతో పాటు పార్టీ మారిన ముగ్గురు ఎమ్మెల్యేలు నోరు మూసుకోని ఉన్నట్లు ఉండకుండా.. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ రోజే.. వంశీ పోలిటికల్ లైఫ్‌కు ఫుల్ స్టాప్ పడిందని, దీంతో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమైందనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అయిందని స్థానికులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలుపు.. అంటే యార్లగడ్డ వెంకట్రావ్ గెలుపు ఖాయమైందనే ఓ ప్రచారం సైతం స్థానికంగా జోరుగా సాగుతోంది.